ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నెలల కిందటే జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు ఆలస్యంగా జరగబోతున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను..ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను.. నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించి తీరాలని ప్రభుత్వాన్ని పలుమార్లు హైకోర్టు హెచ్చరించడంతో.. ఎట్టకేలకు హైకోర్టుకు.. షెడ్యూల్‌ను అందజేశారు దీని ప్రకారం ల 17న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 10న ఫలితాలు వస్తాయి. 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ లోపే ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 3నాటికి ఎన్నికలు పూర్తి అవుతాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టనున్నారు.
అయితే.. రిజర్వేషన్ల అంశం మాత్రం.. ఇంకా అస్పష్టంగానే ఉంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. 50 శాతం రిజర్వేషన్లకు మించరాదు. కానీ ఏపీ సర్కార్ 60 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీనిపై ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తే.. కోర్టు ఇచ్చే రూలింగ్‌ను బట్టి… మిగతా ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలను ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతోనే.. గతంలో తెలంగాణ అనుభవాలు తెలిసి కూడా.. ఏపీ సర్కార్ ఆరవై శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిందనే అభిప్రాయం వ్యక్తమయింది.
మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు.. సిద్ధమవలేదు. పాలన కుదటపడకపోవడంతో.. అధికార పార్టీ టెన్షన్ పడుతోంది. అనేక రకాల సమస్యలు.. ప్రభుత్వాన్ని వెల్లువెత్తాయి. కొన్ని వారు సృష్టించుకోగా.. మరికొన్ని.. అనూహ్యంగా వచ్చి పడ్డాయి. దీంతో.. అన్ని వర్గాల ప్రజలూ.. ఇక్కట్లు పడుతున్నారు. అయితే.. స్థానిక ఎన్నికలు పూర్తిగా గ్రామ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి.. రాష్ట్ర స్థాయి అంశాలు.. ప్రభావం చూపవని అధికార పార్టీ నమ్ముతోంది. ఘోరపరాజయభారంతో ఉన్న టీడీపీ.. అధికార పార్టీని ఎదుర్కోవడానికి కసరత్తులు చేస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలిచి ప్రజావ్యతిరేకత బలంగా ఉందని నిరూపించాలనుకుంటోంది.