బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని అనే యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను వైసీపీ ప్రభుత్వంలో పడవలకు నిప్పు అంటుకున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తి అని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే తనకు సంబంధం లేదని నిరూపించుకుని బయట పడ్డారు. సముద్రంపై వేటకు వెళ్లి చేపలు పట్టి.. కూర కూడా వ ండేసే వీడియోలు పెట్టే లోకల్ బాయ్ నాని ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. ఆ వీడియోను.. తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విట్టర్లో పోస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీ పోలీసులు కేసులు పెట్టి లోకల్ బాయ్ నాని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారందరికీ ఓ గట్టి సందేశాన్ని పంపించారని అనుకోవచ్చు. ఈ బెట్టింగ్ యాప్ లు ఏవీ లీగల్ కాదు. ఇల్లీగల్. డబ్బులు తీసుకుని వీరు ప్రమోట్ చేస్తారు. కానీ వీరు చెప్పారని చెప్పి.. ఇతర యువకులు ఈ బెట్టింగ్ యాప్ ల బారిన పడి సర్వం కోల్పోతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసేవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. టీవీ యాంకరింగ్ తో పాటు రాజకీయ నేతగానూ చెలామణి అవుతున్న అరె శ్యామల అనేక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే డబ్బులు పంచుతూ వీడియోలు చేసే హర్ష సాయి అనే వ్యక్తి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. వీరందరిపై కేసులు పెట్టాల్సి ఉంది.