ఇటీవలి రాజకీయ పరిణామాల తర్వాత ప్రాంతీయ పార్టీల నాయకులు జాతీయ కలలు కనడం తగ్గించేసుకుంటున్నారు. ముందు తమ స్వంత రాష్ట్రాలను కాపాడుకుంటే చాలుననే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. 2009లో యుపి ముఖ్యమంత్రిగా వున్న మాయావతికి ఆ విధమైన ఆశ వుండేది. తర్వాత మరో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆ విధమైన కలలు గన్నారు. 2014 ఎన్నికల ముందు, శాసనసభ విజయం తర్వాత నితిష్ కుమార్ అలాటి ఆలోచనలు చేశారు. ఒక దశలో నవీన్ పట్నాయక్, జయలలిత వంటివారు కూడా ఢిల్లీని చూశారు. మమతా బెనర్జీకి ఇంకా ఆశలున్నాయమే గాని అవకాశాలు లేవు. తెలుగు ముఖ్యమంత్రుల్లో గతంలోనే ప్రధాని పదవిని వద్దన్న చంద్రబాబును ఆ స్థాయి కారణంగానే ప్రధాని మోడీ ప్రత్యర్థిగా చూస్తున్నారని టిడిపి నేతలు నిరంతరం వాదిస్తుంటారు. ఆయన కూడా కొన్నాళ్లు అలా జాతీయ భాషలో మాట్లాడినా తర్వాత తగ్గించుకున్నారు. తాజాగా కెసిఆర్ కూడా తనకు జాతీయ ఆశలు లేవని తెలంగాణ ముఖ్యమని చెప్పేశారు.కాకుంటే ఇప్పుడు చెప్పినట్టు గాక గతంలో హొం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు చెప్పినట్టుగా వెల్లడించారు. సారాంశం మాత్రం అదే. వాస్తవంలో ఒకప్పుడు కెసిఆర్ ప్రతిభకు ప్రధాని పదవే సరైందని టిఆర్ఎస్ నేతలు వాదిస్తుండేవారు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారని సన్నిహితులే అంటుండే వారు.తాజా వ్యాఖ్యలు చూస్తే ఆయన కూడా ఆ ఆశలకు స్వస్తి చెప్పినట్టే కనిపిస్తుంది. అసలు మోడీనే అధికారంలోకి మళ్లీ రావడం కోసం అప్పుడే యుపి బాధ్యులను మార్చేస్తున్నారట. ఇక పట్టుమని పాతిక సీట్లయినా లేని రాష్ట్రాల నేతలకు ఆ అవకాశమెక్కడ వస్తుంది?