ఉగాది రోజున పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలను … ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో సెంటు చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ పథకంపై ఫాలో అప్ చేస్తున్నారు. భూములు అందుబాటులో లేకపోతే… ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. అయితే.. ఇంత చేసినా.. ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ సాధ్యం కాదా.. అనే చర్చ.. అధికారవర్గాల్లో ప్రారంభమయింది. దీనికి కారణం స్థలాలు రెడీ కాకపోవడం కాదు.. ఎన్నికల కోడ్ వర్తించే అవకాశం ఉండటం. ప్రస్తుతం నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగాది ఈ నెల ఇరవై ఐదో తేదీ. ఈ రెండు లక్ష్యాలకు పొంతన కుదరడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే.. ఒకటి కాదు.. మూడు రకాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఒకటి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, రెండు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు, మూడు పంచాయతీ ఎన్నికలు. మూడింటికి విడివిడిగా ఎన్నికల ప్రకటనలు.. షెడ్యూళ్లు విడుదల చేయాలి. ప్రతీదానికి ప్రత్యేక కసరత్తు ఉంటుంది. ఒకే సమయంలో అన్నీ నిర్వహించడానికి సాధ్యం పడదు. ఎంత హడావుడిగా చేసినా.. మరో ఇరవై రోజుల్లో అన్నీ పూర్తి చేయడం కుదరదు. ఏడో తేదీన ఎన్నికల ప్రకటన చేయాలనుకుంటున్నారు కాబట్టి… ఖచ్చితంగా 30వ తేదీ వరకూ ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే.. మధ్యలో వచ్చే ఉగాది ఇరవై ఐదో తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి కోడ్ అడ్డం వస్తుంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదు. ఇరవై నాలుగో తేదీ కల్లా.. అన్ని రకాల ఎన్నికల పోలింగ్‌ను పూర్తి చేసి.. ఇరవై ఐదో తేదీన పంపిణీ చేద్దామన్నా సాధ్యం కాదు. ఎందుకంటే… కౌంటింగ్ ముగిసి.. పాలకవర్గాలు ఏర్పడిన తర్వాతే… కోడ్ ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి… ఎలాగోలా పంచేద్దామని చూస్తే తీవ్ర విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది. ఒక వేళ కోడ్ ఉందని చెప్పి పంచకపోతే.. ప్రభుత్వానిది ఆర్భాటమేనని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిని కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంది.