నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా లేకపోతే.. ఈపాటికి ఎంచక్కా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది. లాక్ డౌన్ వల్ల… షూటింగులు ఆగిపోవడంతో బోయపాటి కూడా ఇంటికే పరిమితం కావల్సివచ్చింది. ఇది అందరికీ ఉన్న సమస్యే. కాకపోతే… ఈ సినిమాకి ఇంకొన్ని కష్టాలు తోడయ్యాయి. ఇది వరకు స్క్రిప్టులో రాసుకున్న లొకేషన్లను పూర్తిగా మార్చాల్సివస్తోందట. ఈ విషయాన్ని బోయపాటినే స్వయంగా చెప్పుకొచ్చాడు. సినిమా కథ ప్రకారం రకరకాల లొకేషన్లలో షూటింగులు చేద్దామనుకున్నామని, అయితే కరోనా వల్ల ఇప్పుడు ఆ లొకేషన్లకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని, లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులకు అనుమతులు ఇచ్చినా – ఆ లొకేషన్లలో ఇక మీదట షూటింగ్ చేయడం కుదరదని బోయపాటి తేల్చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే షూటింగు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు బోయపాటి. అంతకు ముందు వారణాసి నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు. ఇప్పుడు అది మారబోతోంది. లేదంటే… రామోజీ ఫిల్మ్సిటీలోనో, మరో చోటో వారణాసి సెట్ వేసి, అందులో షూటింగ్ చేయాల్సివస్తుంది. లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే షూటింగ్ మొదలు పెట్టడం కష్టమని, కనీసం నెల రోజుల సమయం పడుతుందని, అందుకే రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పడం కష్టమని అంటున్నాడు బోయపాటి.