లాక్డౌన్ దెబ్బకు… ఆర్థికంగా దెబ్బతిన్న వారిలో శ్రీవారు కూడా చేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కొంది. రోజువారీ ఖర్చులకు నిధులు జమ కాక ఇబ్బంది పడుతోంది. యాభై రోజుల నుంచి తిరుమలకు భక్తులను అనుమతించడం లేదు. ఈ కారణంగా.. తిరుమకు ఐదు వందల కోట్లకుపైగా ఆదాయానికి గండి పడింది. రోజుకు లక్ష వరకూ కొండపైకి వచ్చే… భక్తులు.. కనీసం రూ. మూడు కోట్ల వరకూ హుండీ ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు. ఇక దర్శన టిక్కెట్లు, రూముల అద్దెలు, దుకాణాల అద్దెలు.. ఇలా అనేక వనరుల ద్వారా పెద్ద మొత్తంలో టీటీడీకి ఆదాయం లభిస్తుంది. కానీ యాభై రోజులుగా వీటిలో ఏ ఒక్క ఆదాయమూ లేదు.
ఆదాయం లేకపోయినా… ఖచ్చితంగా భరించాల్సిన ఖర్చులు టీటీడీకి ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, తిరుమల మెయిన్టెన్స్ సహా.. నిర్వహణ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. నెలకు రూ. 200 కోట్ల వరకూ ఖర్చులు ఉంటాయని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ పెద్ద ఎత్తున అనుబంధ ధార్మిక సేవా సంస్థలకు.. ఆస్పత్రులకు.. నిధులు ఇస్తూ ఉంటుంది. ఆదాయం లేకపోయినప్పటికీ.. వీటికి కేటాయింపులు మాత్రం బడ్జెట్లో చెప్పిన దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే.. టీటీడీ బడ్జెట్ను రూ. 3309 కోట్లుగా నిర్ణయించారు. అయితే.. రెండు నెలల పాటు ఆదాయం లేదు. అలాగే.. ముందు ముందు ఎప్పుడు అలా పెద్ద ఎత్తున దర్శనాలను అనుమతిస్తారో కూడా క్లారిటీ లేదు. అందుకే.. టీటీడీ .. భవిష్యత్ ఆర్థిక కష్టాలపై ఆందోళన చెందుతోంది.
ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయం ప్రకారం సగం జీతమే ఇస్తున్నారు. ఇవాళ కాకపోతే.. రేపైనా పూర్తి జీతం చెల్లించాల్సిందేనని.. అప్పుడు ఎలా సర్దుబాటు చేయాలని టీటీడీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిజానికి మరో ఏడాది వరకూ ఆదాయం ఆగిపోయినా… శ్రీవారికి ఇబ్బందులు ఉండవు. కానీ ఇంత వరకూ వివిధ రిజర్వులు కింద ఉంచిన వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది.