ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా పుకార్లకు అలవాటుపడిపోయింది. లేనిపోనివి చెప్పి ప్రజల్ని భయపెడితే.. చాలనే స్టేజ్‌కు దిగజారిపోయింది. రాజకీయంగా తాము మద్దతుగా నిలిచే పార్టీకి సపోర్టుగా ఇతర నేతలపై పుకార్లు పుట్టించే అలవాటు నుంచి మెల్లగా ప్రజల్ని భయపెట్టే పుకార్లను పుట్టించే దిశగా తెలుగు టీవీ చానళ్లు దిగజారిపోయాయి. తెలంగాణలో ముఫ్పయ్యో తేదీ తర్వాత లాక్ డౌన్ అంటూ.. ఒక్క సారిగా చానళ్లు బుధవారం రాత్రి పుకార్లు లేపాయి. దీంతో ఒక్క సారిగా పానిక్ ప్రారంభమయింది. ప్రజల్లో కలవరం కలిగింది. ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని ప్రజలు నిత్యావసరాలు.. ఇతర వస్తువులు పెద్ద ఎత్తున కొనుగోలుకు ఆసక్తి చూపడం ప్రారంభించారు.
ఈ ప్రచారం.. ఉద్ధృతం అవుతూండటం.. ప్రభుత్వానికి అదే పనిగా నిజమా అనే ప్రశ్నలు అందడంతో.. ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. అసలు లాక్ డౌన్ ఆలోచనే ఇంత వరకూ చేయలేదని స్పష్టం చేశారు. అయితే మీడియా మాత్రం.. వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసిందని.. హోంశాఖ పరిధిలో ఉందని.. సీఎం కేసీఆర్ కోలుకున్న తర్వాత చేయబోయే సమీక్షలో మొట్టమొదట తీసుకోబోయే నిర్ణయం లాక్ డౌన్ అంటూ కథనాలు అల్లేసింది. డీహెచ్ శ్రీనివాసరెడ్డి మీడియాముందుకు వచ్చి లాక్ డౌన్ కథలన్నీ ఉత్త కథలేనని… ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి లాక్ డౌన్ ప్రతిపాదనలు వెళ్లలేదని స్పష్టం చేశారు.
దీంతో… మీడియా చానళ్లు సర్దుకున్నాయి. ఆ తర్వాత ఆ పుకార్లనుప్రసారం చేయడం ఆపేశాయి. కానీ జరగాల్సిన ప్రచారం మాత్రం జరిగిపోయింది. ప్రజల్లో పానిక్ ప్రారంభమయింది. మీడియా చానళ్లు సంక్షోభసమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విషయాన్ని నిజాలను నిర్ధారణ చేసుకుని ప్రసారం చేయాల్సి ఉంటుంది. కానీ అదేం లేకుండా బాధ్యతా రాహితంగా చానళ్లు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయంలో రోజు రోజుకు దిగజారిపోతున్నాయి.