నాలుగో లాక్ డౌన్ గడువు కూడా ముంచుకొస్తోంది. మరో మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. మరి తర్వాత పరిస్థితి ఏమిటి..? తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాలనే ఆలోచనలనే కేంద్రం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు.. అత్యధికం నమోదవుతున్నాయి. ఈ కారణంతో లాక్ డౌన్ విధిస్తారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా.. సడలింపులు పెంచుకుంటూ పోతారు. మొదటి సారి మార్చి 25న లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పటికి మూడు సార్లు పొడిగించారు. ఈ మధ్యలో రెడ్ జోన్లు మినహా అన్ని చోట్ల 90 శాతం మేర ఆంక్షలు ఎత్తివేశారు. జనం స్వేచ్ఛగా తిరగడం, వలస కార్మికులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లడం, టెస్టులు పెరగడంతో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.
లాక్ డౌన్ ఫైవ్ పాయింట్ ఓ ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై వచ్చే ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడతారని సమాచారం. లాక్ డౌన్ పొడిగింపుకు అనివార్యతలను ఆయన వివరిస్తారు. ఈ సారి కూడా కట్టడి ప్రాంతాలను గుర్తించే ప్రక్రియను రాష్ట్రాలకే వదిలేస్తారని తెలుస్తోంది. స్థానికంగా సడలింపులు కూడా రాష్ట్ర ప్రభుత్వాల అధికారంపైనే ఆధారపడి ఉంటుంది. దేశంలో ఉన్న కరోనా కేసుల్లో 70 శాతం పదకొండు నగరాల్లోనే ఉన్నందున అక్కడ పరిమిత స్థాయిలోనే సడలింపులు ఉంటాయి. ఇళ్లలోంచి బైటకు వచ్చేందుకు కూడా ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి…
లాక్ డౌన్ పొడిగింపు విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ ఇప్పటికే ఆ శాఖ అధికారులతో పాటు..ఇతర శాఖలతోనూ చర్చించారు.పొడిగింపు అనివార్యతలను గుర్తించి.. ఆ సమాచారాన్ని పీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలలుకు పైగా మూసి ఉన్న ఆలయాలు, మత ప్రదేశాలకు జూన్ ఒకటి నుంచి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. భక్తులు లేక వెలవెలబోతున్న ఆలయాల ఆర్థిక స్థితిగతులు కూడా దెబ్బతిన్నాయి. పెద్ద ఆలయాలు కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. దానితో ఇప్పుడు గుళ్ల తలుపులు తెరిచేందుకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది. స్కూల్స్, కాలేజీలు ఇప్పట్లో తెరిచే అవకాశం ఉండదు. జూలైలో కూడా స్కూల్స్ తెరిచే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.