సోషల్ మీడియాలో ఓ మ్యాప్ వైరల్ అవుతోంది. ఆ మ్యాప్‌లో ఒక్క తెలంగాణ మాత్రమే తెల్లగా ఉంది. మిగతా అంతా పుల్ రెడ్ లేదా..లైట్ రెడ్‌తో కవర్ చేసి ఉంది. అంటే… ఫుల్ రెడ్ వేసి ఉన్న రాష్ట్రాలన్నీ పూర్తి లాక్ డౌన్.. లైట్ రెడ్ వేసి ఉన్న రాష్ట్రాలన్నీ పాక్షిక ఆంక్షలు పెట్టాయని అర్థం అన్నమాట. దేశంలో ఏ ఆంక్షలులేని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని.. తెల్ల రంగు వేశారు. నిజానికి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. కానీ దాని వల్ల అసలు ప్రయోజనం ఏమీ ఉండదని ఇప్పటికే అందరూ ఓ అభిప్రాయాని కివచ్చేశారు. ఈ పరిస్థితులు… తెలంగాణ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయేమో తెలియదు కానీ.. అందరూ లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షలు పెట్టినప్పుడు తాము పెట్టకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ… కేసీఆర్ లాక్ డౌన్ ఆలోచనకు వచ్చేశారు.
అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన లాక్ డౌన్‌పై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణతో సరిహద్దు ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్ కూడా.. ఆంక్షలు పెట్టాయి. ఇటు వైపు నుంచి ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి నిరాటంకంగా వచ్చేస్తున్నారు. ఈ తరుణంలో తాము కూడా ఆంక్షలు పెట్టకపోతే.. కరోనా పేషంట్లు తెలంగాణలోకి తరలి వచ్చే అవకాశం ఉందని.. ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లుగా భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ… ఆంక్షలు విధించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిజానికి రెండు రోజుల కిందటే… వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపిన కేసీఆర్ లాక్ డౌన్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
హైకోర్టు కూడా.. వారాంతపు లాక్ డౌన్ గురించి ఆలోచించాలని పదే పదే సూచనలు చేస్తోంది. హైకోర్టు సూచనలు చేసిన తరవాత కూడా లాక్ డౌన్ ఆలోచన లేదన్న కేసీఆర్.. రెండు రోజుల్లోనే మనసు మార్చుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలోని మెజార్టీ ప్రాంతాల్లో స్వచ్చంద లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. అందువల్లే అధికారికంగా ఆంక్షలు విధించినా పెద్దగా తేడా ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే లాక్ డౌన్‌పై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు.