జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోజూ వార్తల్లో ఉంటున్నారు. ప్రత్యేక హోదా భావోద్వేగాల సమస్య అని కాసేపు అంటారు, పేరేదైతేనేం నిధులు ముఖ్యమని జాతీయ మీడియాతో అన్నట్టు కథనాలు వస్తున్నాయి. అందరూ అంటున్నారు కాబట్టి, మంత్రి లోకేష్ అవినీతిపై ఆరోపణ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెబితే… ఆధారాలున్నాయి, తగిన సమయంలో బయటపెడతానంటూ ఎన్డీటీవీతో చెప్పారు. మోడీజీ అంటే వ్యక్తిగతంగా చాలా అభిమానం అంటారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసేది లేదంటారు. జనసేన ఆవిర్భావ సభ జరిగిన దగ్గర నుంచీ రాజకీయంగా ఇలాంటి వ్యాఖ్యలతో కొంత గందరగోళ వాతావరణాన్ని పవన్ సృష్టించడం మొదలుపెట్టారు. ఇంత గందరగోళం వెనక ఏదైనా పక్కా వ్యూహం ఉందా అంటే.. అదీ కనిపించడం లేదు. మరి, సమస్య ఎక్కడుంది అంటే… పవన్ రాజకీయ అపరిపక్వత, మాట్లాడే సమయంలో పవన్ మిస్ అవుతున్న టైమింగ్..!
2014 ఎన్నికల్లో భాజపా, టీడీపీలకు పవన్ మద్దతు ఇచ్చారు కాబట్టి… వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగాలన్న రూలేం లేదు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే సర్వ హక్కులూ ఒక పార్టీగా జనసేనకు ఉంటాయి. అలాగే, ముఖ్యమంత్రిపై కూడా ఆరోపణలూ విమర్శలు చేసే హక్కు కూడా పవన్ కి కూడా ఉంటుంది. కాకపోతే.. సరైన సమయమూ సందర్భమూ చూసుకోకుండా పవన్ స్పందించడమే ప్రస్తుత గందరగోళానికి కారణంగా కనిపిస్తోంది. ఓపక్క.. ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధుల సాధన కోసం కేంద్రంతో సీఎం చంద్రబాబు పోరాటానికి దిగిన సమయంలోనే… పవన్ ఆవిర్భావ సభ పెట్టారు. సభ పెట్టడాన్ని తప్పుపట్టడం లేదిక్కడ..! చంద్రబాబు దర్శకత్వంలో తాను పనిచేస్తున్నాను అనే ఆరోపణలను తిప్పి కొట్టడం కోసం… వాళ్లూ వీళ్లూ అంటున్నారనే ఆధారాల్లేని అవినీతి ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. కేంద్రంపై చంద్రబాబు పోరాటం చేస్తున్న ఈ సమయంలో… పవన్ చేసిన ఆరోపణల్ని భాజపా తమకు అనుకూలంగా మార్చేసుకుంది. ఇది ఉద్దేశపూర్వకమో, కాకతాళీయమో తెలీదుగానీ.. టీడీపీపై భాజపా ఎదురుదాడికి పవన్ కల్యాణ్ పరోక్షంగా సహకరించారు అని చెప్పక తప్పదు.
పవన్ రాజకీయ అపరిపక్వతను భాజపా ఇలా వాడుకుందని అనుకోవాలా, లేదా… పవన్ పరిభాషలో చెప్పాలంటే ‘అందరూ అనుకుంటున్నట్టుగా భాజపా ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు’ అని భావించాలా అనేది వేరే చర్చనీయాంశం. ఒకవేళ రాజకీయ పరిపక్వతే ఉంటే… నాలుగేళ్లుగా టీడీపీ అవినీతిని చూస్తూ ఓపిక పట్టిన పవన్, మరో నాలుగు వారాలు ఆగలేరా..? రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్న కారణంతో నాడు ఓటుకు నోటు కేసుపై కూడా అతిగా స్పందించలేదని ఒకటికి పదిసార్లు చెప్పే పవన్… ఇప్పుడు అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో టీడీపీ పోరాటం చేస్తుంటే, ఇంకొన్నాళ్లు ఎందుకు ఓపిగ్గా ఉండలేకపోయారు..?
ప్రజారాజ్యం ప్రారంభంలో కూడా చిరంజీవి ఈ స్థాయిలో గందరగళానికి గురి కాలేదు. తొందరపడుతూ విమర్శలూ ఇలాంటి వ్యాఖ్యలూ చెయ్యలేదు. కారణం ఏంటంటే.. ఆరోజున చిరంజీవి వెనక పరకాల ప్రభాకర్ లాంటి సీనియర్లు, సలహాదారులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పవన్ వెనక లేనిది అదే. జనసేనకు సరైన మార్గనిర్దేశం చేసేవారు లేరు. దీనికి తోడు తనను తాను రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో కొంత అపరిపక్వంగా పవన్ వ్యవహరిస్తున్నారు.