ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ రవాణా సంస్థ గేట్ వే డిస్ట్రిపార్క్ రూ. 150 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ పట్నం వద్ద అతి పెద్ద కంటెయినర్ టెర్మినల్ నిర్మిస్తోంది. దాని నిర్మాణ పనులు మొదలుపెటినట్లు ఆ సంస్థ తెలియజేసింది. భారత్ నుండి విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులు, ఆహార ఉత్పత్తులు, అలాగే విదేశాల నుండి భారత్ కి దిగుమతయ్యే వస్తువులను కలిగిన కంటెయినర్లను నిలువ చేసి వాటి గమ్యాలు చేర్చడానికి అవసరమయిన వ్యవస్థలు, సౌకర్యాలు అన్నీ ఈ కంటెయినర్ టెర్మినల్లో ఉంటాయి. అలాగే కూరగాయలు, బియ్యం, గోధుమలు వంటి వాటిని, ఇతర మాంస ఉత్పత్తులను నిలువ చేసేందుకు సాధారణ మరియు శీతల గిడ్డంగులు ఈ టెర్మినల్లో ఉంటాయి. ఈ ఎగుమతులు, దిగుమతుల దేశీయ రవాణా కోసం అవసరమయిన ఏర్పాట్లు కూడా ఈ టెర్మినల్లోనే ఏర్పాటు చేయబడతాయి. ఇది దేశంలోనే అత్యాధునిక కంటెయినర్ టెర్మినల్ గా నిలుస్తుందని గేట్ వే డిస్ట్రిపార్క్ ప్రతినిధులు తెలిపారు.