గురువారం నాడు వెలువడే ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తూ ఉత్కంఠ తో ఎదురు చూస్తుంది. ఎవరికి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్న అంచనాలు.. అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో… రాష్ట్రపతి కీలకం కాబోతున్నారు. రాష్ట్రపతి పదవిలో ఉన్న కోవింద్… ఒకప్పుడు బీజేపీ నేతే. ఆయన… మోడీ మాటను జవదాటరనే పేరు ఉంది. మరి… రాబోయే కీలక పరిస్థితుల్లో.. రాష్ట్రపతి భవన్దే కీలకం కాబోతోంది. మరి అది దేశ ప్రజాస్వామ్య విధానానికి వన్నె తెస్తుందా..?
ఫలితాల తర్వాత ఒక్కటి కాబోతున్న విపక్షాలు..!
వివిధ రకాల సర్వేలు, అంచనాల ప్రకారం బీజేపీ కి రెండొందల సీట్లు లోపే వస్తాయి . ఎన్డీఏ భాగస్వాములతో కలిసినా మెజారిటీ కష్టమే. అంచనాలే నిజమని తేలితే అందరి దృష్టి రాష్ట్రపతి భవన్ మీదికి మళ్లుతుంది . ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ రాకుంటే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఏంచేస్తారు …? అత్యధిక స్థానాలు వచ్చిన బీజేపీ ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారా …? అదే జరిగితే అందుకు ప్రతిపక్షాలు అనుసరించే ప్రతి వ్యూహం ఎలా ఉండబోతున్నది …? ఇప్పటికైతే 21 ప్రతిపక్షాలు మోదీ ని ఓడించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వెలువడిన తరవాత , పార్లమెంటు శీతాకాల సమావేశాల అనంతరం 21 ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ లో సమావేశమయ్యాయి . రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న శక్తులను ఓడించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి .
కోవింద్ మైనార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారా..?
ఫలితాల అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాత్ర కీలకంగా మారుతుందని ఇప్పటికే అంచనాలు సాగుతున్నాయి. మరి రాష్ట్రపతి ఏంచేయబోతున్నారు . అతి పెద్ద పార్టీగా అవతరించే బీజేపీ ని ముందుగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారా … ? ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని రోజులు సమయం ఇస్తారు …? రాజకీయ వర్గాల్లో ఇలాంటి చర్చలు సాగుతున్నాయి. ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి పాత్ర ఏమిటన్నది ప్రశ్న . నిజానికది రాష్ట్రపతికి అగ్ని పరీక్ష వంటిదే . ఒకటి రాజ్యాంగం తనకు అప్పగించిన పాత్ర నిర్వర్తించడం. రెండోది దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం . ఈ రెండిటి మధ్య సమతూకం ఎలా పాటించాలి …? సర్కారియా కమీషన్ కొన్ని సిఫార్సులు చేసింది . మొదటిది ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్న కూటమికి మెజారిటీ వస్తే దానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి . దానినే ప్రభత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి . రెండోది మెజారిటీ దక్కని సింగిల్ లార్జెస్ట్ పార్టీ ని ఆహ్వానించాలి . ఎన్నికల తరవాత ఏర్పడి ప్రభుత్వం లో అందరూ భాగస్వాములయ్యే కూటమికి మూడో ప్రాధాన్యం ఇవ్వాలి . నాలుగోది చివరిది …కొన్ని పార్టీలు ప్రభుత్వం లో భాగస్వాములై , మరికొన్నీ బైట నుంచి మద్దతు ఇచ్చే కూటమికి చివరి ప్రాధాన్యం ఇవ్వాలి .
రాష్ట్రపతి నిర్ణయం ప్రజాస్వామానికి చేటు తేకూడదు..!
ప్రస్తుతం ఉన్న కూటమి.. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కూటమి. ఎన్నికల తరవాత ఒక్కటైన పార్టీల కూటమికి మెజారిటీ ఉంటే …అప్పుడు రాష్ట్రపతి ఏంచేయాలి …? అలాంటప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకీ మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది . ఇలాంటప్పుడే రాష్ట్రపతి స్థాయి బైట పడుతుంది . అయన తీసుకునే నిర్ణయం చరిత్ర లో నిలిచిపోతుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం . ఎన్డీఏ లేదా యూపీఏ లో ఎవరికీ మెజారిటి వస్తే వారికి మొదటి ప్రాధాన్యం దక్కవచ్చు . మెజారిటీ దక్కని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలబడితే …దానికి రెండో ప్రాధాన్యం దక్కవచ్చు . ఒకవేళ బీజేపీ ని ఆహ్వానించినా … ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని రోజులు సమయం ఇస్తారు …? ఎందుకంటే పార్టీలను ప్రలోభపెట్టడం … ఎంపీలను కొనుగోలు చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలను నిరోధించడం కూడా రాష్ట్రపతి బాధ్యత . కానీ కోవింద్ ఏం చేయబోతున్నారు..?