యూపియే హయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులకి చట్టబద్దత కల్పించకపోవడంతో తరచూ న్యాయపరంగా సమస్యలు ఎదురవుతుండేవి. ఓటరుగా నమోదు చేయించుకోవడానికి లేదా గ్యాస్ సబ్సిడీ, ప్రభుత్వాలు ఇచ్చే వృద్దాప్య పెన్షన్లు వగైరా ప్రభుత్వ సంక్షేమ పధకాల కోసం సదరు సంస్థలు ఆధార్ కార్డు వివరాలను కోరినపుడు కొన్నిసార్లు న్యాయస్థానాలు జోక్యం చేసుకొని అడ్డుకొనేవి. ఈ సమస్యను పరిష్కరించడానికే కేంద్రప్రభుత్వం ఈరోజు లోక్ సభలో ఆధార్ వ్యవస్థకి ఆమోదం తెలిపి చట్టబద్దత కల్పించింది. ఆధార్ కార్డుల ద్వారా ప్రజల వివరాలను సేకరించినప్పటికీ ఈ బిల్లులో సెక్షన్:9 ప్రకారం ఆ వివరాలను సేకరించినవారు వాటిని బహిర్గతం చేయడం నేరంగా పరిగణించబడుతుంది. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అత్యంత గోప్యంగా ఉంచవలసి ఉంటుంది.
అయితే అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఏటిఎం, క్రెడిట్ కార్డుల పిన్ నెంబర్లనే చెప్పమని అడుగుతున్నపుడు, ఆధార్ వివారాలను గోప్యంగా ఉంచుతారనుకోవడం భ్రమ. అయితే చట్ట ప్రకారం దానికి ఒక నిబంధన ఏర్పరచాలి కనుకనే దానిని చేర్చారని చెప్పుకోవచ్చును. అటువంటి చట్టాలకు, దానిలో ఉండే నిబంధనలకు మన దేశంలో అన్ని స్థాయిలలో తూట్లు పొడుస్తూనే ఉంటారనేది బహిరంగ రహస్యమే.