తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన వ్యవహారం మెల్లగా ప్రభుత్వ అధికారులకూ చుట్టుకుంటోంది. తనపై దాడి చేశారని.. కారణం లేకుండా అరెస్ట్ చేశారని ఎంపీ హోదాలో బండి సంజయ్ లోక్ సభ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. స్వయంగా హాజరై తన వాదన వినిపించారు. ఆధారాలిచ్చారు. ఇప్పుడు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ సహా పలువురు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
హోంశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ, డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ, సత్యనారాయణ, కరీంనగర్ ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ డీఎస్పీలకు ఈ నోటీసులు అందాయి. వీరందర్నీ ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు కూడా తప్పు పట్టింది. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ కూడా రంగంలోకి దిగింది.
ఇప్పుడు అధికారులు ఆ అరెస్టును సమర్థించుకోలేకపోతే.. రాజకీయ కారణాలతోనే అరెస్టులు చేశారన్న అభిప్రాయానికి ప్రివిలేజ్ కమిటీ వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. అధికారులపై సీరియస్ చర్యలకు సిఫార్సు చేస్తే.. బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది.