ప్రస్తుతం 543 లోక్సభ నియోజవర్గాలు ఉన్నాయి. 1971 జనాభా ప్రాతిపదికగా రాష్ట్రాలకు లోక్సభ సీట్లు కేటాయించారు. 2002లో చివరి సారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు…కూడా 1971 లెక్క ప్రకారం నియోజవర్గాల పునర్ విభజన చేశారు. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగాలని చట్టం చెబుతోంది. అంటే 2031 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ ఐదు దశాబ్దాల కాలంలో… జనాభా నియంత్రణను ఓ ఉద్యమంలా ప్రచారం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయి. ఫలితంగా దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది. ఉత్తరాదిలో పెరిగింది. ప్రస్తుతం ఉన్న జనాభా, పెరుగుదల రేటును అంచనా వేస్తే.. 45 పార్లమెంట్ సీట్లు దక్షిణాది నుంచి ఉత్తరాదికి బదిలీ కానున్నాయి…
జనాభాను నియంత్రించడం కూడా దేశభక్తేనని.. ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు పదిహేనో తేదీన ఎర్రకోట పై నుంచి సందేశం ఇచ్చారు. కానీ.. జనాభాను నియంత్రించినందుకు ఆయన ఇప్పుడు దక్షిణాదిని శిక్షించబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభలో ఇప్పుడు ఉన్న సీట్లు 129 అయితే.. 2026 పునర్విభజన తర్వాత దక్షిణాదికి 84 సీట్లే ఉండబోతున్నాయి. ఈ విషయంపై… మర్రి శశిధర్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం… ఇది మరో దేశ విభజన ఉద్యమంగా మారుతుందని హెచ్చరికలు పంపడం కలకలం రేపుతోంది. నిజానికి జనాభాను తగ్గిస్తే ప్రొత్సాహకాలు ఇవ్వాలని కానీ..ప్రస్తుతం దక్షిణాదిని కేంద్రం శిక్షిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను లెక్కచేయకుండా 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి తాజా జనాభానే ప్రాతిపదికగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వం రేపు 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనకూ అప్పటి జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలనే పట్టుదలతో ఉంది.
నిధుల విషయంలోనే కాదు..రాజకీయంగానే దక్షిణాదిని దెబ్బకొట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికను తీసుకుంటే… జనాభాను నియంత్రించి..దేశానికి మంచి చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడమేనని వాదించాయి. ఇప్పుడు కేంద్రం పట్టించుకునే స్థితిలో లేదు. జమిలీ ఎన్నికలతో… దేశం మొత్తం ఊడ్చేయాలనుకుంటున్న బీజే్పీ ఇక ఎవరి అభిప్రాయాలు వినిపించుకునే పరిస్థితులో కూడా లేదు.