టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు పెట్టమని ఆదేశించిన లోకాయుక్తను కూడా పార్టీగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. లోకాయుక్త ఆదేశంతో అశోక్ బాబుపై గత నెల 24న కేసు పెట్టి గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేసింది. అయితే ఆయనపై నమోదైన అభియోగాలపై ఎప్పుడో విచారణ పూర్తయింది. ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశారని లోకాయుక్త కేసు పెట్టాలని ఆదేశించారు. వెంటనే సీఐడీ అదే చాన్స్ అనుకుని కేసు పెట్టి అరెస్ట్ చేసింది.
బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని, ప్రమోషన్ల కోసం తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు ఆధారంగా అవే అంశాలతో కేసులు పెట్టారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ అసలు డిగ్రీ సర్టిఫికెటే తాను పెట్టలేదని.. డిగ్రీ అర్హతతో ఎలాంటి ప్రమోషన్లు పొందలేదని అశోక్ బాబు చెబుతున్నారు. 2018లో ప్రభుత్వం కూడా అదే చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన ఏసీటీవోగానే రిటైరయ్యారు.
అయితే ఆయనపై లోకాయుక్తకు చేసిన ఫిర్యాదులో కానీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కానీ ప్రాథమికఆధారాలు ఉన్నాయని ప్రస్తావించలేదు. హైకోర్టులో బెయిల్ పిటిషన్పై జరిగిన విచారణలోనూ ఆధారాలు సమర్పించడానికి గడువు కావాలని కోరారు. దీంతో హైకోర్టు అన్ని వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించి విచారణనుసోమవారానికి వాయిదా వేసింది. లోకాయుక్తకు అసలు విచారణ పరిధి లేకపోయినా ఆదేశించారని అశోక్ బాబు తరపు లాయర్లు వాదించడంతో ఆయనను పార్టీగా చేర్చారు.