తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి మామా అల్లుళ్ల పితలాటకం తప్పడం లేదు.మొదట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఇద్దరినీ సర్దుబాటు చేయలేక ఎన్టీఆర్ సతమతమయ్యేవారు. తిరుగులేని నాయకుడు గనక తన శైలిలో నడిపించేవారు. అయినా ఆఖరుకు అల్లుడి చేతులో పదవీచ్యుతుడవక తప్పలేదు. భారత రాజకీయ చరిత్రలోని రసవత్తర ఘట్టాల్లో అదొకటిగా చెప్పాలి. ఎన్టీఆర్ మొండి పట్టువల్లే ఇది జరిగిందని కాదు వెన్నుపోటు అని ఎవరి కోణాన్ని బట్టి వారు చెప్పొచ్చు గాని అదంతా ముగిసిన అధ్యాయం. ఇప్పుడు మళ్లీ మరోరూపంలో తెలుగుదేశం మామా అల్లుళ్ల మధ్య సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది.ఒక్కరోజైనా ముఖ్యమంత్రిని కావలసిందేనని భీష్మించిన బాలకృష్ణ మోజు గురించి గతంలో చెప్పుకున్నాం.ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు కూడా ఇదే ఒక చికాకుగా వుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కాకున్నా కనీసం ముందు రాష్ట్రమంత్రినైనా కావాలని బాలయ్య కోరుకుంటున్నారట. ఇంకోవైపున చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను మంత్రివర్గంలో తీసుకోవడం గురించి తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో మామా అల్లుళ్లను ఇద్దరినీ ఒకేసారి తీసుకోవడం వాస్తవికంగా వుండదు. బావను వదలి లోకేశ్‌నే తీసుకుంటే ఎన్టీఆర్ కుటుంబ స్పందన ఎలా వుంటుంది? తాను ఎన్టీఆర్ కుటుంబాన్ని గౌరవించగలను గాని నందమూరి వంశం అంటూ హడావుడి చేస్తే చేయగలిగింది లేదని ఒకసారి చంద్రబాబే అన్నారు. బాలయ్య కోర్కె ముమ్మాటికీ వంశపారంపర్య వాంఛ నుంచి వచ్చిందే. దాన్ని మన్నించడం జరిగేపని కాదని అందరికీ తెలుసు. మంత్రి పదవిఅంటూ ఇస్తే తర్వాత ఎలా వ్యవహరిస్తారో? గతంలో హరికృష్ణను తీసుకుని నేర్చుకున్న పాఠాలున్నాయి.పైగా మామపైనే తిరుగుబాటు చేసిన చంద్రబాబు ఇరవై ఏళ్ల తర్వాత ఆయన కుమారులను మళ్లీ తెచ్చి నెత్తిన పెట్టుకోవడం జరగదు. బాలయ్యను వియ్యంకుణ్ని చేసుకుని శాసనసభకు రప్పించినా కుటుంబ సమస్యలు సద్దుమణగకపోవడం చంద్రబాబుకు అంతర్గత సమస్యే. ఏది ఏమైనా బాలయ్యకు నచ్చజెప్పి లోకేశ్‌ను మంత్రిగా తీసుకునే అవకాశమే ఎక్కువంటున్నారు. అదే సమయంలో ఆయన ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిహౌదాలో కొనసాగుతారని సమాచారం.