అగ్రిగోల్డ్ బాధితులకు రూ. పదివేల చొప్పున పరిహారం పంపిణీ చేసే సమయంలో.. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి ప్రతీ చోటా.. జిల్లాల్లోనూ మంత్రులు కోరస్గా ఒకే మాట చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు, లోకేష్ కాజేయడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. చివరికి శ్రీకాకుళంలో… స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అదే మాట అన్నారు. ఆయన మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు గుడ్డలూడదీస్తామన్నారు. వెంటనే లోకేష్ కూడా స్పందించారు. ఓ బహిరంగ లేఖ రాశారు. ఆరోపణలకు తక్షణం ఆధారాలు బయట పెట్టి.. తమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల పాటు.. ఎన్ని విచారణలు చేసినా.. తమపై ఒక్క ఆధారం కూడా.. బయట పెట్టలేకపోయారని.. గుర్తు చేశారు. ఇప్పటికైనా పోయేదేమీ చేసిన ఆరోపణలు నిరూపించాలని.. లేకపోతే.. మీ ముఖ్యమంత్రి బట్టలువిప్పదీయాలని… కౌంటర్ ఇచ్చారు. ఇది వైసీపీ నేతల్ని.. మంత్రుల్ని సూటిగానే తగిలింది.
మీడియా ప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా.. గతం లో చేసిన.. ఇప్పుడు కూడా చేస్తున్న ఆరోపణలకు.. ఆధారాలను.. లోకేష్ అడుగుతున్నారని.. ఆ మేరకు సవాల్ చేసి.. లేఖ రాశారని గుర్తు చేస్తున్నారు. దీనికి మంత్రులు.. తడబడుతున్నారు. అసలు విషయానికి మాత్రం రాకుండా.. లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడని.. వ్యవస్థల్ని నాశనం చేశారని.. అలాంటి వ్యక్తి తమకు సవాల్ చేయడం ఏమిటని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. అడ్డదారిలో మంత్రి పదవి పొందిన లోకేష్.. ఆరోపణలకు ఆధారాలు చూపించడం అడగడమేమిటన్నది మంత్రుల లాజిక్.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అధికార పక్షంపై ఆరోపణలు చేయడం సహజమే. వారి దగ్గర అధికారం లేదు కాబట్టి నిరూపించలేరన్న వాదన వినిపంచవచ్చు. కానీ అధికారపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేస్తూ… ఏమీ సాక్ష్యాలు బయట పెట్టకపోతే ప్రజలు వేరే రకంగా అనుకునే ప్రమాదం ఉంది. అయితే.. అధికారపక్షంలో ఉన్నా సరే.. ఆరోపించడం తమ జన్మహక్కన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. మరి ఆధారాలు బయట పెట్టాలంటే..ఆ విషయం వదిలేసి..ఇతర ఆరోపణలు చేసుకుంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.