తెలుగుదేశం పార్టీపై ఉన్న విమర్శల్లో ప్రధానమైంది… జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశపూర్వకంగా పార్టీకి దూరంగా పెడుతున్నారన్నది! నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సమాంతరంగా ఎదిగే అవకాశం ఉందనే పక్కన పెట్టేసినట్టు ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి. నిజానికి, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటానికి కూడా టీడీపీ నేతలు పెద్దగా ఇష్టపడని పరిస్థితి పార్టీలో ఉందని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో అతడి గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై లోకేష్ స్పందించారు. దాన్లో భాగంగా ఎన్టీఆర్ తో విభేదాల అంశం ప్రస్థావనకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవనీ లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేందుకు ఎవరు ముందుకొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. ఎవరైతోనైనా వ్యక్తిగతంగా విభేదాలు పెంచుకోవాల్సిన అవసరం ఏముందని లోకేష్ అన్నారు. విభేదించదగ్గ సమస్యలు కూడా లేవనీ, తనకు రాష్ట్రం, ప్రజలు, కుటుంబం తప్ప తనకు వేరే వ్యాపకాలు లేవని చెప్పారు.
కొద్దిరోజుల కిందట ఎన్టీఆర్ విషయమై నారా లోకేష్ మరోలా మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘పార్ట్ టైమ్ పాలిటిక్స్’ చేసేవారు అవసరం లేదనీ, పార్టీకి పూర్తి స్థాయిలో సహకరించి కృషి చేసేవారు మాత్రమే కావాలని అన్నారు. కానీ, ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించారు! నిజానికి, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేసి, కొంత ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత, 2014కు వచ్చేసరికి పార్టీలో ఎన్టీఆర్ ప్రస్థావన లేకుండా పోయింది. అంతేకాదు, మహానాడులకు కూడా ఎన్టీఆర్ ను పిలవడం మానేశారు. దీంతోనే విమర్శలు పెరిగాయి. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాకనే, ఎన్టీఆర్ తోపాటు హరికృష్ణను కూడా పక్కన పెట్టేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఇదంతా చూస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ తరఫున ఎన్టీఆర్ ను ప్రచారం దించే అవకాశాలు దిశగానే జరుగుతున్న ప్రయత్నాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఓ పక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇంకోపక్క, ప్రతిపక్షం వైకాపా ఇప్పట్నుంచే ఎన్నికల మూడ్ లోకి వచ్చేసింది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకుంటే టీడీపీకి మరింత మేలే కదా! ఎలాగూ లోకేష్ మంత్రి అయిపోయారు, పార్టీలో అప్రకటిత అధినేత పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి, ఇప్పుడు ఎన్టీఆర్ ను చేరదీసుకోవచ్చు కదా! పైగా, పార్టీ కోసం ‘పని చేసేవారు’ అనే శ్లేష కూడా పెట్టారు కదా!