ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ, ఎన్నికలలో దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ సీపీ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే, 2019 ఎన్నికలు వచ్చేసరికి అదే 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీకి దేవుడు మిగిల్చాడని, ఆ రకంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ చాలా గొప్పదని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే సరిగ్గా జగన్ పాలన నెల రోజులు పూర్తి చేసుకున్న సమయానికి, లోకేష్, జగన్ దేవుడి స్క్రిప్ట్ డైలాగు ని కేంద్రంగా చేసుకొని సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. దేవుడు స్క్రిప్ట్ లో కేవలం కామా పెట్టాడని మీరు దాన్ని ఫుల్స్టాప్ అనుకొని గుడిని గుడిలో లింగాన్ని మింగేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేసాడు లోకేష్. పట్టి సీమ, పోల వరం, అమరావతి, విద్యుత్తు ఒప్పందాలు – ఈ నాలుగు అంశాల్లోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పటి జగన్ వైఖరికి, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వైఖరికి తేడాలు చూపుతూ లోకేష్ చేసిన ట్వీట్ కు మంచి స్పందన వస్తోంది.
లోకేష్ ట్వీట్ చేస్తూ, ” దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్లూ ఉంటాయి జగన్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు. దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాడు. మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథా తథంగా కేంద్రంతో ఓకే చేయించాడు. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్రటేరియట్లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడైనా చంద్ర బాబు గారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మళ్లీ కామా పెట్టాడు. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే… అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.” అని రాసుకొచ్చారు. వీటితోపాటు గతంలో పట్టిసీమ ని వ్యతిరేకిస్తూ, పలుమార్లు పలు వ్యాఖ్యలు చేసిన జగన్, ఇప్పుడు అదే పట్టిసీమ కు నీళ్ళు వదిలిన విషయాన్ని గుర్తు చేస్తూ, జగన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను సైతం పొందుపరుస్తూ, మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ ఇప్పుడేమంటారు అంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు లోకేష్.
లోకేష్ వేసిన పంచ్ లకు వైఎస్ఆర్ సిపి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.