నారా లోకేష్ కోటరీలోని మరో వ్యక్తికి కీలక ప్రభుత్వ పదవి లభించింది. ప్రవాస తెలుగు వ్యవహారాల సలహాదారుగా అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ రవి వేమూరు ని నియమిస్తూ గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . లోకేష్ ఇటీవల అమెరికాలో పర్యటించినపుడు ఆయన కార్యక్రమాలు, పర్యటనల సమన్వయకర్తగా డాక్టర్ రవి వేమూరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల ముందు విరాళాల సేకరణలో, అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించటం వంటి అంశాలు డాక్టర్ రవి వేమూరుకి ఈ పదవి రావటంలో కీలక పాత్ర వహించాయి. లోకేష్ అమెరికా పర్యటనలో ప్రైవేట్ జెట్ని సమకూర్చినందుకే ఈ పదవి దక్కిందని ప్రవాసాంధ్ర తెలుగుదేశం శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీ మీద ప్రభుత్వం మీదా యువరాజు లోకేష్ కి ఉన్న పట్టుకి ఈ నియామకం చిన్న ఉదాహరణ మాత్రమేనంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని ప్రవాసాంధ్ర ప్రముఖుడు ఆనంద్ కూచిభొట్ల కి కొన్ని నెలల క్రితం క్యాబినెట్ రాంక్ తో కూచిపూడి నాట్యరామం అధ్యక్షుడిగా నియమించినప్పుడే అసంతృప్తి వ్యక్తమైనా, అది కళలకి సంబంధించిన విషయం కాబట్టి పోనీలే అని ప్రవాసాంధ్ర తెలుగుదేశం వర్గాలు సరిపెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రవాసాంధ్ర శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కూడా డాక్టర్ రవి వేమూరు చివరి నిమిషంలో – లోకేష్ తో ఉన్న సాన్నిహిత్యంతో – ఎగరేసుకు పోవటంతో గత రెండు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది.
ఈ పదవిలో రవి వేమూరి – విదేశీ పెట్టుబడుల ఆకర్షణ మరియు విదేశాల్లో వుండే తెలుగు వారికి సేవలు అందించడం వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ తరపున సలహాదారునిగా వ్యవహరిస్తారు. ‘స్మార్ట్ విలేజ్’ కార్యక్రమం లో భాగంగా ప్రవాసాంధ్రులని గ్రామాల దత్తత చేసుకునేలా ప్రోత్సహించడం, ఉపాధి కల్పన తదితర అంశాల్లో సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఏది ఏమైనా డాక్టర్ రవి వేమూరు తనకప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించి మంచి పనితీరు కనబరిస్తే సరే, లేకపోతే ఈ కోటరీ నియామకాల వల్ల ఇటు కార్యకర్తలలో అసమ్మతిని, అటు ప్రభుత్వానికి చెడ్డ పేరును పార్టీ మూటగట్టుకోక తప్పదు.