సాక్షి పత్రిక లో ఇటీవల లోకేష్ మీద వచ్చిన కథనం బాగా ప్రాచుర్యం పొందింది. చిరు తిళ్ళ కోసం లోకేష్ విశాఖ ఎయిర్పోర్టులో పాతిక లక్షలు ఖర్చు చేశాడంటూ ఇటీవల సాక్షి కథనాన్ని ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా లో వైఎస్ఆర్సిపి అభిమానులు లోకేష్ ని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ పాతిక లక్షల బిల్లు లో గత ప్రభుత్వం 12 లక్షలు మాత్రమే చెల్లించింది అని, మిగిలిన 13 లక్షల కోసం హోటల్ ఓనర్ జగన్ ప్రభుత్వానికి బిల్లులు పంపించగా ఈ విషయం బయటకు వచ్చిందని సాక్షి కథనం లో వ్రాసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లోకేష్ ప్రజాధనాన్ని విస్తృతంగా గా దుర్వినియోగం చేశాడు అన్న ముద్ర వేసే ఉద్దేశంతోనే ఈ కథనం కొనసాగించినట్లు అర్థమవుతోంది. దీని పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు నారా లోకేష్.
సాక్షి వ్రాసిన ఆ కథనాన్ని సాక్ష్యాధారాలతో ఖండిస్తూ లోకేష్ సోషల్ మీడియా లో నే వివరణ ఇచ్చారు. జగన్ ఢిల్లీ పర్యటన లో ఏమి సాధించారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న సాక్షి ఉద్దేశ పూర్వకంగానే తన మీద అసత్య కథనాన్ని రాసిందని లోకేష్ ఆరోపించారు. లోకేష్ ట్వీట్ చేస్తూ, “అక్రమాస్తుల పెట్టుబడుల తో కట్టు కథలు అల్లేందుకు పుట్టిన విష పుత్రిక సాక్షి. జగన్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, సాక్షి మీడియా కి ఏం చేయాలో తోచక, మతి, నీతీ లేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలు పెట్టింది. తెదేపా అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరు తిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చు పెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చింది. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను. ఐదేళ్ల ఏపీ సర్కారు ప్రోటోకాల్ ఖర్చు నాకు జమ వెయ్యమని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా?ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా? చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేర గాళ్ళు. సాక్షి నా పై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసింది. ఉదాహరణ కు 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారు. అక్టోబర్ 30, 2018న నేను ప్రొద్దుటూరు లో ధర్మ పోరాట దీక్షకు హాజరయితే ఆ రోజు విశాఖ ఎయిర్ పోర్టులో అయిన రూ.79,170 లు బిల్లు ను కూడా నా అకౌంట్లో వేశారు. విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపి లందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం సాక్షి లాంటి నీతి మాలిన మీడియాకే సాధ్యం ” అంటూ వ్రాసారు.
ఇటీవల జగన్ ప్రభుత్వం జనసేన అభిమానులు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారంటూ వారి మీద ఉక్కు పాదం మోపి కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే టీవీ5 , ఆంధ్ర జ్యోతి చానల్స్ మీద ప్రభుత్వం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. మరి, సాక్షి రాసిన కథనం పూర్తిగా అసత్యమని లోకేష్ సాక్ష్యాధారాల తో సహా నిరూపించిన దరిమిలా, సాక్షి పత్రిక మీద కనీస చర్యలు అయినా ఉంటాయా అన్నది ప్రశ్నార్థకం. చర్యలు తీసుకోక పోయినా కానీ, మున్ముందు ఇటు వంటి కథనాలు వ్రాసే ముందు సాక్షి వారు ఒక నిమిషం పాటు ఆగి ఆలోచిస్తారా అన్నది వేచి చూడాలి. మరి లోకేష్ వివరణ పై సాక్షి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.