సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గౌతు శిరీషతో పాటు మంత్రి పార్థసారధి ఇతర టీడీపీ నేతలు పాల్గొొన్నారు. వారంతా ఓపెన్ టాప్ జీప్ పై ర్యాలీ కూడా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జైలుకెళ్లాల్సిన జోగి రమేష్ ను టీడీపీ నేతలే కాపాడుతున్నారని మండిపడటం ప్రారంభించారు.
ఈ అంశం లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన పార్టీ నేతల నుంచి వివరణ కోరినట్లుగా సమాచారం . మంత్రి పార్థసారధితో పాటు గౌతు శిరీషను కూడా ఆయన వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అది పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని సామాజికవర్గ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమమని వారు చెబుతున్నారు. గౌడ సంఘం వాళ్లు ఏర్పాటు చేస్తే అన్ని పార్టీల నేతలు హాజరయ్యారని.. అంతే తప్ప.. ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ ను కార్యక్రమానికి పిలవలేదని అంటున్నారు. ఇదే విషయాన్ని వారు నారా లోకేష్ కు చెప్పే అవకాశం ఉంది.
మరో వైపు టీడీపీ సోషల్ మీడియా గతంలో జోగి రమేష్ టీడీపీపై, చంద్రబాబుబై చేసిన వ్యాఖ్యల వీడియోను వైరల్ చేస్తోంది. టీడీపీ నేతలు కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అంటున్నారు. వైసీపీ హయాంలో ప్రత్యర్థి పార్టీల నేతలంటే వ్యక్తిగత శత్రువులే అన్నట్లుగా రాజకీయాలు మారిపోవడంతో టీడీపీ క్యాడర్ కూడా అదే స్తాయి రివెంజ్ కోరుకుంటోంది. అందులో సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.