భారతదేశంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ‘నేను నిప్పులా బ్రతికాను’ అని మన చంద్రబాబు చెప్పినన్ని సార్లు చెప్పి ఉండరేమో. అసలే దేశంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడికి అయినా నీతి, నిజాయితీల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రజలు ఆలోచిస్తున్న సమాజం మనది. ఎన్నికల్లో నిలబడడం కోసం సీట్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారం నుంచే నీతి, నిజాయితీలకు తిలోదకాలిస్తున్నారు మన నాయకులు. ఇక ఆ తర్వాత ఓటర్లకు డైరెక్ట్‌గా డబ్బులు పంచడం, అబద్ధపు హామీల వర్షంతో గద్దెనెక్కాలనుకోవడం లాంటివేవీ కూడా నిజాయితీపరులు చేసేవి కాదు. ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తూ కూడా అదేదో వాళ్ళ జేబుల్లోనుంచి తీసి ఇస్తున్నట్టుగా సిగ్గులేకుండా డప్పేసుకుంటారు. అవినీతికి అవకాశమున్న ప్రాజెక్టులు మాత్రమే చేపడుతూ ఉంటారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నవాళ్ళను కూడా కాపాడేస్తూ ఉంటారు. కార్పోరేట్ కంపెనీల దగ్గర లంచాలు తీసుకుంటూ…ఆ కంపెనీల లాభాల కోసం ఓట్లేసిన ప్రజలను హింసిస్తూ ఉంటారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచీ కూడా ప్రతి క్షణం లంచాల కోసమే బ్రతుకుతున్న నాయకులు ఉన్న దేశం మనది. అందుకే అవినీతి ర్యాంకింగ్స్‌లో మనదేశం దూసుకుపోతోందని తాజా సర్వేలు కూడా తేల్చిచెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రగామిగానే నిలుస్తోంది.
అలాంటి నాయకులకు నీతి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? అందుకే నేను నిజాయితీపరుడిని అని చెప్పడానికి దేశంలో ఉన్న చాలా మంది నాయకులు మొహమాటపడుతూ ఉంటారు. కాస్త సిగ్గుగా కూడా ఫీలవుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నేను నిప్పులా బ్రతికానని ఎన్ని సార్లయినా చెప్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత శాసనసభ సభ్యులలో ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచకుండా ఎన్నికైన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నాడా అని ప్రశ్నిస్తే ధైర్యంగా సమాధానం చెప్పగలరా? నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన మాట వాస్తవమా? కాదా? అంటే సమాధానం చెప్పగలరా? ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ మీదా? కాదా? అంటే యస్ ఆర్ నో అని చెప్పగలరా? అంతటి నికార్సయిన నిప్పులాంటి మనుషులే అయితే వీడియో సాక్ష్యంతో దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని ఇంకా పార్టీలో ఎందుకు ఉంచారు? పైగా ఓటుకు నోటు కేసులో దొరికిపోయాక ప్రమోషన్ కూడా ఇచ్చారు. పోనీ రేవంత్ రెడ్డి కూడా నిప్పులాంటి నాయకుడే అని చెప్పగలరా?
ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకూ చంద్రబాబు అండ్ కో నుంచి స్పష్టమైన సమాధానం రాదు. కానీ చంద్రబాబు నాయుడు నిప్పు అంటే ప్రజలు నమ్మాలి. నమ్మేవరకూ చెప్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు కూడా తండ్రి బాటలోనే మాట్లాడడం మొదలెట్టాడు. నీతి నిజాయితీతో రైట్ రాయల్‌గా బ్రతకడం నేర్చుకున్నాం అని చెప్తున్నాడు. చంద్రబాబుకు ఉన్నంత సామర్థ్యం లోకేష్‌కి లేదని టిడిపి నేతలే అంతర్గతంగా చెప్తూ ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం చంద్రబాబుకు తగ్గ లోకేషుడే.