తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ నియోజకవర్గాన్ని ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయనున్నారు. లోకేష్ కు ఉండవల్లిలోనే ఓటు హక్కు ఉంది. తనకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలోనే పోటీ చేయనున్నారు. లోకేష్ గతంలో.. భీమిలి, విశాఖ నార్త్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయా నియోజకవర్గాలకు భారీగా పోటీ ఉండటం… పలువురు పోటీకి ఆసక్తి చూపిస్తూండటంతో లోకేష్ రేసు నుంచి వైదొలిగారు. దీంతో.. చివరికి మంగళగిరి నుంచి సీటును ఖరారు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో..టీడీపీ మొదటి సారి, చివరి సారి 1983లో మాత్రమే గెలింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో పోటీ చేసింది కూడా తక్కువే. పొత్తులు ఉంటే… ఆ నియోజకవర్గాన్ని ఎక్కువగా.. మిత్రపక్షాలకు కేటాయించేది. గత ఎన్నికల్లో మాత్రం విజయం అంచు వరకూ వచ్చిన టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి పోస్టల్ బ్యాలెట్లను నిర్లక్ష్యం చేయడంతో 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ సారి నేరుగా లోకేష్ బరిలోకి దిగుతున్నారు.
మరో వైపు అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి.. పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగనున్నారు. తను వైదొలిగి.. కుమారుడికి చాన్సివ్వాలని… పరిటాల సునీత నిర్ణయించుకున్నారు. వాస్తవానికి కల్యాణ దుర్గం లేకపోతే.. హిందూపురం పార్లమెంట్ స్థానం… నుంచి.. అదనంగా… అవకాశం ఇవ్వాలని.. ఆమె హైకమాండ్ ను కోరారు. కానీ సామాజిక సమీకరణాల రీత్యా సాధ్యం కాలేదు. మరో వైపు జేసీ సోదరులు ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగి.. తమ వారసులకు చాన్సిచ్చారు. ఇప్పుడు పరిటాల శ్రీరాం.. బరిలోకి దిగకపోతే… వారి కంటే జూనియర్ అయిపోతాడన్న ఉద్దేశంలో… పరిటాల సునీత .. తన సీటును త్యాగం చేసి కుమారుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే.. శ్రీరాం బరిలోకి దిగితే.. తర్వాత మంత్రి పదవి విషయంలో ఇబ్బందులొస్తాయని… చంద్రబాబు తటపటాయించినా… చివరికి అంగీకరించారు.
మొత్తానికి టీడీపీలో యువతరం పోటీ ఎక్కువగా ఉంది. మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా.. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని.. తన కుమారుడు విజయ్‌కి చాన్సివ్వాలని కోరుతున్నారు. మొత్తానికి టిక్కెట్లన్నీ ఖరారు చేసే సరికి… తెలుగుదేశం పార్టీలో యువ ఎమ్మెల్యే అభ్యర్థుల హడావుడి ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తోంది.