చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన బృందంలో మంత్రి లోకేశ్ కూడా వుంటారని మొదట అధికారికంగా చెప్పారు. తర్వాత అంతే అధికారికంగా సవరించారు. ఇది వ్యూహాత్మక మార్పే అనుకోవాలి. నాన్నతో పాటు పదిమందిలో ఒకరుగా తిరేగకంటే ఇక్కడే వుండటం ద్వారా ఆయన పరోక్షంలో తానే నాయకుడినని ఆచరణలో చూపించుకోవచ్చు. అందుకు తగినట్టే తనూ పర్యటనలు ప్రారంభోత్సవాల తతంగం పెట్టుకున్నారు. నిజానికి లోకేశ్‌కు ఐటితో పాటు గ్రామీణాభివృద్ది శాఖ ఇవ్వడంలోనే బోలెడు ప్రచారావకాశం వుందని పార్టీ ప్రతినిధులు ముందే చెప్పారు. ఇకపై వూరూరా రోడ్లపక్కన లోకేశ్ వేసిన శంకుస్థాపన రాళ్లు,ప్రారంభ ఫలకాలు మనకు కనిపిస్తాయి. ఏమంటే రైతాంగం,గ్రామీణులు సంక్షోభంలో వుంటారు గాని కేంద్రం మాత్రం ఆ పథకాల పేరిట విపరీతంగా కేటాయింపులు చేస్తుంటుంది. గ్రామీణాభివృద్ధి పథఖాలు సంస్థలు ఎన్ని వున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.ఈ శాఖ ద్వారా లోకేశ్‌కు అవన్నీ అందుబాటులోకి వచ్చినట్టే. ఇది చాలక అమరావతిలో కీలకమైన భూ కేటాయింపుల కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించారు. రెవెన్యూ మంత్రిగా వున్న ఉప ముఖ్యమంత్రి కెఇకృష్ణమూర్తిని కాదని లోకేశ్‌ను ఎంపిక చేయడంలో ఉద్దేశం ఆర్థికంగా ముఖ్యమైన చోట, రాజధాని వ్యవహారాలు నిర్దేశించడానికేనని అందరికీ అర్థమై పోయింది.అయినా విమర్శలకు సమాధానంగా మంత్రి కొల్లు రవీంద్ర పెద్ద సమర్థనే విడుదల చేశారు. ఎక్కువగా ఐటి కంపెనీలకు కేటాయింపులు చేయాలి గనక ఆ శాఖ చూసే వారిని నియమించడం అవసరమన్నారు. లోకేశ్ గాక మరెవరన్నా వుంటే ఈ తర్కం వుండేది కాదేమో. ఏమైనా పాలనా పరమైన నిర్ణయాల్లోనే గాక ఆర్థిక లావాదేవీల్లోనూ అబ్బాయి ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు మొదటి నుంచి చెబుతూనే వున్నారు. ఈ నేపథ్యంలో కామధేనువులాటి అమరావతి కేటాయింపులను ఆయనకు తెలియకుండా జరగనిచ్చే అవకాశమే లేదు. కాకుంటే ఈ నియామకంతో అది అధికార ముద్ర వేసుకుంది. అమరావతి ఎలాగూ ఆలస్యమవుతుంది గనక, ఆరోపణలు అనివార్యం గనక ఆవన్నీ ఆయన భవిష్యత్తుకు నష్టమని మొదట కొంత తటపటాయించినా అంతిమంగా ఆర్థిక వ్యవహారాలదే పైచేయి అయినట్టు కనిపిస్తుంది.లోకేశ్ అంటూ వున్నాక ఇతర మంత్రుల మాట చెల్లుబాటు వుండదని కూడాచెప్పనవసరం లేదు. సో అటు గ్రామాలనుంచి ఇటు రాజధాని వరకూ అబ్బాయి హవా మొదలైందన్నమాట.