ఆంధ్రా పాలిటిక్స్ లో చినబాబు నారా లోకేష్ ప్రాధాన్యతను క్రమక్రమంగా పెంచుతూ… ఆ విధంగా ముందుకుపోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొదట, పార్టీపై పట్టు కోసం కొన్నాళ్లు ఆ బాధ్యతలు చూశారు. ఆ తరువాత, ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీని చేసుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాలుగు రోజుల్లోనే కీలకమైన శాఖకు మంత్రిని చేశారు. మంత్రి అయిన మరో నెలరోజులకే అత్యంత కీలకమైన కమిటీలో ప్రాధాన్యత కల్పించారు. ఒక ముఖ్యమైన కమిటీలో లోకేష్ ని సభ్యుడిగా నియమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సర్కారు గురువారం నాడు ఒక జీవో విడుదల చేసింది. భూ కేటాయింపుల కమిటీలో మంత్రి నారా లోకేష్ సభ్యుడిగా ఉంటారు. ఈయనతోపాటు ఇతర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆనంద్ బాబులకు చోటు కల్పించారు. మంత్రి నారా లోకేష్ కు కమిటీలో చోటు కల్పించడమే విశేషం అనుకుంటే… ఈ కమిటీలో రెవెన్యూ మంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి ప్రాధాన్యత కల్పించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది!
నిజానికి, భూకేటాయింపులు అనేవి రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా రాబోతున్న పరిశ్రమలకుగానీ, ఐటీ కంపెనీలకుగానీ భూములు కేటాయించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఇలాంటి కేటాయింపులన్నీ కమిటీ ద్వారా మూవ్ అయినా… అంతిమంగా రెవెన్యూ శాఖ ద్వారానే కదా నిర్ణయాలు అమలు కావాల్సింది. అంత కీలకమైన కమిటీలో రెవెన్యూ శాఖ మంత్రికే ప్రాధాన్యత కల్పించకపోవడంపై ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంత కీలకమైన కమిటీలో తన తరఫున మాట్లాడేందుకు ఒక బలమైన వాయిస్ గా లోకేష్ ఉంటారనే ఉద్దేశంతో అతడిని ముఖ్యమంత్రి నియమించి ఉండొచ్చు. నిజానికి, ఇదే కాదు.. తనకు కేటాయించిన శాఖ పరిధిని దాటి చినబాబు జోక్యం ఉంటోందన్న విమర్శలు ఈ మధ్య వినిపించాయి. ఆ మధ్య ఓ సమావేశంలో ఇతర శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా లోకేష్ స్పందించారనీ, దాంతో ఆయా శాఖల ఆమాత్యులు నివ్వెర పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా కథనాలు చక్కర్లు కొట్టాయి. ఏదైతేనేం, వీలైనంత తొందరగా చినబాబును తెలుగుదేశం సర్కారులో అత్యంత కీలకమైన శక్తిగా ఎదిగేందుకు కావాల్సిన బేస్ ను తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా నియామకం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ కమిటీలో కె.ఇ.కి చోటు కల్పించకపోవడం వెనక ఇంకేమైనా ప్రత్యేక కారణాలున్నాయేమో తెలియాల్సి ఉంది! సో.. భూకేటాయింపుల కమిటీలో చినబాబు పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.