ఎపి మంత్రి నారా లోకేశ్ షరా మామూలుగా ఏడవ ఏట తన కుటుంబ ఆస్తులు విడుదల చేశారు. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ముందే పూర్తయి వుంటాయి గనక ఆ ప్రకటనలో పెద్ద సంచలనాలేమీ వుండవు. కాకపోతే ఈ సమయంలో ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలే మీడియాకు మేత. జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు గందరగోళం వుందో లేదో గాని ఆయన పర్యటన నేపథ్యంలో వైసీపీ, టిడిపిలు మాట్లాడుతున్న తీరు మాత్రం గందరగోళం పెంచుతున్నది. చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ పెద్దగా విమర్శలు చేయకపోయినా చేసినమేరకు జనం మెచ్చుకుంటారేమోనన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తుంది. అందుకే ఖండించేందుకు హడావుడి పడిపోతున్నది. ఇక టిడిపి అయితే పవన్ వేరు జగన్ వేరు అంటూ ఆయన విమర్శలను ఆహ్వానిస్తూ స్పందిస్తున్నది.మిగిలిన ప్రతిపక్షాలపై అసహనంతో విరుచుకుపడుతూ అనుమతులు నిరాకరించే ప్రభుత్వం పవన్‌కు ఎందుకు ఎర్రతివాచీ పరుస్తున్నట్టు? ఆయన వ్యక్తిత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా చేసేందుకు మాత్రమే అది పనికి వస్తుంది.ఇప్పుడు లోకేశ్ కూడా పోలవరం త్వరగా పూర్తికావాలని పవన్ కోరుతుంటే ఆలస్యం కావాలని వైసీపీ అడ్డుపడుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఏ కొలబద్దల ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు? మొత్తంపైన పవన్ మాతోనే వున్నాడనే సంకేతాలు పంపేందుకు టిడిపి వ్యూహం అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఆయన తెలిసీ దీన్ని అనుమతిస్తున్నారా అన్నది తెలియదు. మరోవైపున వైసీపీ కూడా పవన్ మాట్టాడక ముందే ఆయనపై దాడికి దిగుతూ గందరగోళం పెంచుతున్నది. ప్రతిపక్ష స్థానం తమకు మాత్రమే స్వంతమని వైసీపీ భావిస్తే పొరబాటే. ఎవరిరైనా ఏ మేరకైనా ఉపయోగపడితే ఉపయోగించుకోవాలిగాని పవన్‌పై భజన ముద్ర వేసి తాము తాము జగన్ బజన చేస్తే ఏమవుతుంది? ఇక పవన్ కళ్యాణ్ కూడా అత్తారింటికి దారేదీ అన్నట్టు తన రాజకీయ మార్గమేదో తేల్చుకోవాల్సిందే. ఈ పర్యటనలో సామాజిక పునాదిని కాపాడుకోవడంపై ఆయన దృష్టిపెట్టడం అర్థమవుతూనే వుంది. పోలవరంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శనాత్మకంగా మాట్లాడిన మాట కూడా నిజమే. అయితే ఆయన పర్యటన సమయం తమకు అడ్డు వచ్చిందని వైసీపీ ఆగ్రహించడం అర్థం లేని విషయం.ఎవరి ప్రాధాన్యత వారు కాపాడుకోవాలి గాని మరెవరిపైనో ఆక్రోశిస్తే ప్రయోజనమేమిటి? పవన్ చంద్రబాబు పట్ల మెతగ్గా వున్న మాట నిజం కావచ్చు గాని భజన ఆరోపణలు వాస్తవం కాదు. ఏమైనా ఆయన జగన్ భజన చేయరు. స్వంతంగా నిలబడాలన్నా లేక వీరు ఆరోపిస్తున్నట్టు చంద్రబాబును బలపర్చినా జగన్‌పై విమర్శలు తప్పవు.