ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలు ఏంటంటే… అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, టీడీపీ చేస్తున్న మంచి పనుల్ని చూసి ఓర్వలేకపోతున్నారు, యజ్ఙం జరుగుతూ ఉంటే రాక్షసుల్లా ఆటంకాలు కలిగిస్తున్నారు! సందర్భం ఏదైనా కావొచ్చు.. దాన్లో ఈ అంశం ప్రస్థావనకు తీసుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో వైకాపా నేతల తీరుపై ఆయన సీరియస్ అయిపోయారు. జరుగుతున్న అభివృద్ధిని ఎవరైనా ఇలా అడ్డుకుంటారా అంటూ వైకాపాపై మండిపడ్డారు.
ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు వేస్తున్నారంటూ ఎవరైనా ఇలా లేఖలు రాస్తారటండీ అంటూ ఓ ప్రెస్ మీట్ లో విమర్శలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారనీ, చివరికి ఆయన పార్లమెంటు నియోజక వర్గంలో కూడా దాదాపు 200 కిలోమీటర్ల మేర సిమెంట్లు రోడ్లు వేశామన్నారు. అంటే, ఆయన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారా అనీ, రోడ్లు పేద ప్రజల కోసమే కదా వేసిందనీ, ఎన్నాళ్లని బురదలో ఉండాలని లోకేష్ అన్నారు. ప్రతీ పనిలోనూ ఎందుకిలా అడ్డం పడుతున్నారో అర్థం కావడం లేదనీ, అది కూడా ఓ పద్ధతి ప్రకారం ఒకరు ప్రధాని లేఖ రాస్తాస్తే మరొకరు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేస్తారు.. ఇది ఎంతవరకూ న్యాయం అనేది వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. నిధులు రాకుండా వారే ఇలా అడ్డుపడతారనీ, తరువాత నిధులు ఇవ్వడం లేదని విమర్శించేదీ వారే అన్నారు. ఏనాడూ జరగని అభివృద్ధి మనం చేసుకుంటున్నామనీ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
అయితే, ఇదేదో కొత్త టాపిక్ కాదు. ఓ వారం రోజుల కిందట ఇదే అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇవే విమర్శలు చేశారు. వైకాపా నేతలు చేసిన ఫిర్యాదుల కాపీలతో ప్రెస్ మీట్లు పెట్టారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు ఆలస్యం కావడానికి కారణం వైకాపా అంటూ మండిపడ్డారు. ఆయనే కాదు.. అంతకుముందు కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ఇదే టాపిక్ మీద ఓ రెండు పేపర్లు పట్టుకుని మీడియా ముందుకొచ్చారు. వీళ్ల ఫిర్యాదుల మూలంగానే బిల్లులు ఆగిపోయాయనీ, తరువాత కేంద్రం ఒక కమిటీ వేసిందనీ, ఆ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చేసిందనీ, నిధులు త్వరలోనే వస్తున్నాయనీ చెప్పారు. ఉపాధి హామీ పనుల విషయంలో వైకాపా నేతలు చేసిన ఫిర్యాదులపై టీడీపీ చేయాల్సిన విమర్శలన్నీ అయిపోయాయి! మళ్లీ ఇప్పుడు మంత్రి లోకేష్ అదేదో కొత్త అంశంగా మీడియా ముందు చెప్పడం విశేషం. సీఎం చేసిన విమర్శల్నే మక్కీకి మక్కీ మళ్లీ దించేశారు! వైకాపా అభివృద్ధి నిరోధక శక్తి అనే విమర్శను ప్రజలకు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు గుర్తు చేయాలన్నదే టీడీపీ వ్యూహం అన్నట్టుగా కనిపిస్తోంది.