తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వంలో కీ పొజిషన్లలో ఉన్న వారు ఎవరైనా అమెరికా వెళ్తే .,.. మొదటి రోజు నుంచి అనని పెట్టుబడులు వచ్చాయి.. ఇన్ని పెట్టుబడులు వచ్చాయని ఉదరకొట్టే వార్తల్ని పీఆర్ విభాగం పంపుతుంది. ఎంవోయూలు చేసుకున్నారని చెబుతూంటారు. నారా లోకేష్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కానీ ఆయన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా వంటి అన్ని అగ్రశ్రేణి కంపెనీల హెడ్ క్వార్టర్లకు వెళ్లారు. కీలక వ్యక్తులతో సమావశం అయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేశారు. ఆసియాలో.. ఇండియాలో ఎప్పుడు పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నా ఏపీని కూడా పరిగణనలోకి తీసుకునేలా చేయగలిగారు.
డోర్ టు డోర్ ప్రమోషన్లను కంపెనీలు ఎందుకు చేస్తాయి ?. ఖచ్చితంగా తమ ఉత్పత్తుల్ని కొనాలని మాత్రమే కాదు.. ప్రతి ఇంటికి తమ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి. ఓ వ్యక్తి ఓ ఉత్పత్తి గురించి యాభై ఇళ్లకు వెళ్లి చెప్పడం అంటే మాములు ప్రమోషన్ కాదు. అప్పటికి ప్రొడక్ట్ కొనలేకపోవచ్చు కానీ రేపటికి అవసరం అనిపిస్తే ఖచ్చితంగా వారి మెదడులో ఇంటికి వచ్చిన అడిగిన ఉత్పత్తే కనిపిస్తుంది. ఇది అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. దీన్ని లోకేష్ అమలు చేశారని అనుకోవచ్చు. బడా కంపెనీలన్నింటికీ ఏపీలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత, పెట్టుబడులు పెడితే వచ్చే ప్రయోజనాలు ఇలా అన్నింటిపై అన్ని కంపెనీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఓ మల్టీనేషనల్ కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే … ఒక్క వ్యక్తి నిర్ణయంతో అయ్యే పని కాదు. సీఈవోనో..యజమానో డిసైడ్ చేయలేరు. ఓ వ్యవస్థ పని చేస్తుంది. తమ పెట్టుబడులు ఎక్కడ సురక్షితమో.. ఎక్కడ లాభదాయకమో నివేదికలు తెప్పించుకున్న తరవాతనే నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో వారు షార్ట్ లిస్ట్ చేసుకునే ప్రదేశాలే కీలకం. ఇప్పుడు ఆ షార్టులిస్టుల్లో ఏపీ ఉండేలా చేయడంలో లోకేష్ సఫలీకృతం అయ్యారని అనుకోవచ్చు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి. అందుకే లోకేష్ పర్యటన… పెట్టుబడుల ప్రకటనల్లేకపోయినా అద్భుతమైన ప్రయత్నమని ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రశంసిస్తున్నాయి.