రెండు నెలల క్రితం నారా లోకేష్ ని రాజ్యసభకి పంపించి కేంద్ర మంత్రిని చేయాలనుకొంటున్నట్లు తెగ ప్రచారం జరిగింది. ఆ తరువాత తూచ్! అప్పుడే డిల్లీకి కాదు. లోకేష్ అవసరం రాష్ట్రానికి చాలా ఉంది కనుక ఆయనను మంత్రివర్గంలో తీసుకొంటాము అని తెదేపా నేతలే తెగ ప్రచారం చేశారు. మళ్ళీ తూచ్! ఆయన అవసరం పార్టీకి చాలా ఉంది కనుక మహానాడు సమావేశాలలో ఆయనకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం చేసారు. నారా లోకేష్ కోసం తెదేపా నేతల చేసిన ఈ ప్రచారం, మీడియా లీకులపై విమర్శలు వెల్లువెత్తడంతో తెదేపా నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు.
మళ్ళీ చాలా రోజుల తరువాత లోకేష్ గురించి తెదేపా నేత ఒకరు మహానాడు తరువాత నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకి తెలిపారు. అంటే విమర్శలకి భయపడే తెదేపా నేతలు లోకేష్ భజన ఆపారు కానీ ఆయనకి ఏదో ఒక కీలక బాధ్యత అప్పగించడం తధ్యమని స్పష్టం అవుతోంది. అది నిజమో కాదో తెలియాలంటే మహానాడు సమావేశాలు ముగిసేవరకు వేచి చూడక తప్పదు. ఒకవేళ నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకొంటే తెదేపాలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు అసంతృప్తికి గురి కావచ్చు. ప్రస్తుతానికి వారు మౌనం వహించినా ఏదో ఒకరోజు వారు బయటపడవచ్చు. ఒకవేళ లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, అది వారసత్వ ప్రకటనగానే చూడవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు తరువాత తెదేపా బాధ్యతలు ఆయనకే అప్పగించబోతున్నట్లు దృవీకరించినట్లు భావించవచ్చు.