హైదరాబాద్: నారా లోకేష్‌ను రాజ్యసభకు పంపి తదనంతరం కేంద్ర మంత్రిని చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ నేతలు, ఏపీ మంత్రుల ఒత్తిడి పెరుగుతోందంటూ ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ కథనం ప్రకారం… లోకేష్‌ను కేంద్రమంత్రి చేయాలనే డిమాండ్ గతంలోనే ఉన్నప్పటికీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఇటీవల మరి కొన్ని పోర్ట్ ఫోలియోలు కట్టబెట్టి ప్రమోషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, దీనిపై ఆయన కొందరు మంత్రులతో కూడా మాట్లాడారని చంద్రబాబుకు సన్నిహితుడైన మంత్రి ఒకరు చెప్పారు. వచ్చే జూన్ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలో లోకేష్‌ను లోక్‌సభకు నామినేట్ చేసి, తర్వాత కేంద్రమంత్రిగా చేస్తారని ఏపీ మంత్రి వెల్లడించారు.
లోకేష్ ఇప్పటివరకు ఆసెంబ్లీకి గానీ, కౌన్సిల్కుగానీ పోటీ చేయలేదు. అయినా కూడా ఆయనను ఏపీ మంత్రిని చేయాలనుకుంటే చంద్రబాబుకు అది పెద్ద పనేమీ కాదు. ముందు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి తర్వాత మంత్రిగా చేసేయొచ్చు. అయితే అలా చేయకపోవటం వెనక ఒక వ్యూహం ఉందంటున్నారు. ప్రస్తుతం లోకేష్ రెండు రాష్ట్రాలలోనూ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. అతనిని ఏపీలో మంత్రిగా చేస్తే తెలంగాణలో పర్యటించటంగానీ, పార్టీ వ్యవహారాలను చూడటంగానీ చేయలేరు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చూడటానికి ముందునుంచీ చంద్రబాబుకు కుదరటంలేదు. ఈ పరిస్థితుల్లో లోకేష్‌ను ఏపీ మంత్రిగా చేస్తే పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యతను మరొకరికి అప్పగించాల్సిఉంటుంది. దీనివలన పార్టీ తమనుంచి చేజారిపోతుందని బాబు భావిస్తున్నారు.
లోకేష్ కేంద్ర మంత్రి అయితే తెలంగాణలో, ఏపీలో నిరభ్యంతరంగా పర్యటించొచ్చు. ఇలా చేయటంవలన టీఆర్ఎస్ విమర్శలను తప్పించుకోవచ్చు. 2019 ఎన్నికల సమయానికి లోకేష్‌ను ఏపీకి తీసుకొచ్చేసి అసెంబ్లీకి నిలబెట్టాలన్నది చంద్రబాబు యోచనగా చెబుతున్నారు. మరోవైపు ఈ జూన్‌తో పదవీకాలం ముగియనున్న కేంద్రమంత్రి సుజనా చౌదరికి కొనసాగింపు ఉండకపోవచ్చంటున్నారు. అంటే ఆయన మంత్రి పదవే లోకేష్‌కు వస్తుందన్నమాట.