ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కుంటున్న అతి ప్రధాన సమస్య ఏంటి? హైటెక్ హంగులో, ఇప్పటికిప్పుడు సింగపూర్ అయిపోవడం ఎలా అన్నవైతే అస్సలు కాదు. మంచి నీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామసీమల్లో తాగడానికి నీళ్ళు దొరక్క లక్షలాది మంది ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచీ కూడా మన నాయకులు ప్రాజెక్టులు నిర్మిస్తూనే ఉన్నారు. కోట్లాది ఎకరాలకు నీళ్ళిస్తూనే ఉన్నారు. కానీ ఏడాది ఏడాదికీ రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. మన పల్లె సీమలు ఖాళీ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మన నాయకులు హామీలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
నేను కూడా చాలా పెద్ద నాయకుడినే అని ప్రజలను నమ్మించడం కోసం, ప్రజల్లో నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం, ఇప్పటి వరకూ తమ సమస్యలను పరిష్కరించే నాయకుడిగా చంద్రబాబును నమ్మిన ప్రజలందరూ కూడా ఇకపై తనను నమ్మేలా చేసుకోవడం కోసం కొత్తగా పల్లెసీమల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు వెళ్తున్న లోకేష్‌బాబు ఇప్పుడు కొత్తగా హామీలిస్తున్నారు. ఈ హామీలన్నీ కూడా రైతు రుణమాఫీ ఫైలుపైనే మొదటి సంతకం పెడతా అని చెప్పి మడత బేరం పెట్టిన చంద్రబాబు తరహా హామీలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే లోకేష్ ఇస్తున్న హామీలు మాత్రం చంద్రబాబు అసమర్థతను బయటపెట్టేలా ఉన్నాయి. రెండేళ్ళలో గ్రామాలకు నీటి కరువు సమస్య లేకుండా చేస్తా అని తాజాగా హామీ ఇచ్చాడు లోకేష్. ఈ హామీ విన్న తెదేపా జనాలు చప్పట్లు కొట్టారు. ఆ పార్టీ భజన మీడియా జనాలు చిడతలు వాయించారు. కానీ కాస్త బుర్రపెడితే ఓ సందేహం మాత్రం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నీటి కరువును రెండేళ్ళలో పరిష్కరించే సామర్థ్యం లోకేష్‌కి ఉన్నప్పుడు….ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ మూడేళ్ళలో అదే సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయినట్టు? అంటే లోకేష్ కంటే చంద్రబాబు అసమర్థుడనా? లేకపోతే 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన వందలాది హామీలు పోగా మిగిలి ఉన్న వందలాది హామీలను లోకేష్ ఇవ్వడం మొదలెడుతున్నాడనా? మన నాయకుల దశాబ్ధాల పాలన పుణ్యమాని ప్రజా సమస్యలకు మాత్రం అస్సలు కొరత లేదు. అంటే నాయకులకు హామీల కొరత కూడా లేదు. వాటే రాజకీయం అబ్బా. ఈ విషయంలో మత్రం మన నాయకులు నిజంగానే ప్రపంచానికి పాఠాలు చెప్పగలరు.