సందర్భం ఏదైనా, ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదైనా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడటం టీడీపీ నేతలకే తెలిసిన ఆర్ట్! ఈ కళ చినబాబు నారా లోకేష్‌కు కూడా బాగానే అబ్బుతున్నట్టుగా ఉంది. అందుకే, మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన లెక్చర్ దంచేశారు! మహిళలు అన్ని రంగాల్లోనూ ఎంతో సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వారికి లభించాలని కోరారు.
రాజకీయాల్లోకి కొంతమంది మహిళలు వచ్చినా కూడా పురుషులే వారిపై పెత్తనం సాగిస్తున్నారంటూ లోకేష్ అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందనీ, మహిళల విద్యాభివృద్ధి కోసం ఆయన ఎన్నో విశ్వవిద్యాలయాలు కట్టించారనీ, ఎంతో కృషి చేశారని చెప్పారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. తమ కుటుంబంలో మహిళకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామనీ, తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణీలు బిజినెస్‌లో దూసుకుపోతున్నారంటూ లోకేష్ చెప్పారు.
ఇలాంటి లెక్చర్లు ఇస్తున్నప్పుడే చాలా విషయాలు ప్రజలకు గుర్తుకొస్తుంటాయి. మహిళా సాధికారత గురించి ఇంత మాట్లాడుతున్న సీఎం తనయుడు… ఇదే మహిళా దినోత్సవం రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు..? అక్కడి మహిళల కష్టాలు కనిపించడం లేదా..? ఎన్టీఆర్ హయాంలో మహిళకు ఎంతో ప్రాధాన్యత ఉండేది అనేది వాస్తవం. కానీ, ప్రస్తుతం చంద్రబాబు హయాంలో జరుగుతున్నది కూడా సాధికారత సాధన అని చాటుకోవడమే విడ్డూరంగా అనిపిస్తోంది.
ఈ మధ్యనే మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకురాలు రోజా విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. ఆహ్వానించినట్టే ఆహ్వానించి… ఆమెను అవమానించారు. సరే, ఇది రాజకీయ ప్రయోజనం కోసమే అనుకుందాం కాసేపు! స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళా సాధికారత గురించి ఎలా మాట్లాడారో కూడా విన్నాం! మహిళలు ఇంట్లోనే ఉంటేనే మంచిదనీ, ఎలాంటి భద్రతాపరమైన సమస్యల ఉండవని ఆయన కితాబిచ్చారు. ఇక, కొన్ని కాలేజీల్లో ర్యాగింగులూ కొంతమంది విద్యార్థినుల ఆత్మహత్యలు… ఆ సందర్భంగా కొంతమందిని కాపాడేందుకు వీలుగా ప్రభుత్వం అనుసరించిన వైఖరీ.. అన్నీ ప్రజలకు గుర్తున్నాయి.
వాటి గురించి లోకేష్ మాట్లాడితే బాగుంటుంది. ర్యాగింగ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు జరిగిన న్యాయమేంటో చెప్తే ఇంకా బాగుండేది..? డ్వాక్రా మహిళలకు రుణ మాఫీలు ఎంతగా మేలు చేస్తున్నాయో చెబితే మరీ బాగుండేది..? తుందుర్రులో గర్బిణీలతో సహా మహిళల్ని అరెస్టులు చేసి పోలీసులు లాక్కెళ్లిన తీరుపై వివరణ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది..? తనని చాలా రకాలుగా హింసిస్తున్నారంటూ మీడియా ముందుకొచ్చిన కోడెల శివప్రసాదరావు కోడలుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన న్యాయం గురించి మాట్లాడితే మరీమరీ బాగుండేది..? ఇవన్నీ వదిలేసి… తన ఫ్యామిలీలో మహిళలకు వ్యాపారాలు ఉన్నంత మాత్రా… రాష్ట్రవ్యాప్తంగా మహిళా సాధికారత పరిఢవిల్లుతోందని చిత్రిస్తే ఎలా..? సాధికారత అంటే వారి ఫ్యామిలీకి మాత్రమే ఉంటే సాధించినట్టేమో..!