వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు రోజుల నుంచి బూతుల ప్రవాహం చేస్తున్నారు. ఆ పార్టీలో స్పెషలిస్ట్ అయిన కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి… తన బ్రాండ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. మరికొంత మంది నేతలూ అదే పని చేస్తున్నారు. వీరంతా ఎందుకు ఇంత ఆవేశ పడుతున్నారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. అసలు విషయం మాత్రం లోకేష్. మూడు రోజుల కిందట..కర్నూలు జిల్లాలో టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఫ్యాక్షన్ హత్యలకు గురయ్యారు. వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లిన లోకేష్… కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
ఆసమయంలో… మీడియాతో మాట్లాడిన లోకేష్.. ప్రతీకారం ఉంటుందని ప్రకటించారు. ఆ సమయంలో కుక్క అనే పదం వాడారు. అది ఎవర్ని ఉద్దేశించి అన్నారో స్పష్టత లేదు. వైసీపీ కుక్కలకు అన్నారు. ఎప్పుడూ పరిధి దాటకుండా.. ప్రజాస్వామ్య భాషలోనే మాట్లాడే లోకేష్… కర్నూలులో అలా మాట్లాడటం వైరల్ అయింది. ఇది వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. వెంటనే… రంగంలోకి దిగిపోయారు. లోకేష్ మహా అయితే ఒక మాట అనగలరు…. తమకు అంతకు మించి భాషా సామర్ధ్యం ఉందని రంగంలోకి దిగిపోయారు. నిజానికి వైసీపీ నేతల భాషా సామర్థ్యంపై ఎవరికీ అనుమానం లేదు.
గత రెండేళ్ల నుంచి వారి సామర్థ్యాన్ని చెవులారా ప్రజలు ఆస్వాదిస్తూనేఉన్నారు. ఇప్పుడు..మరో స్టేజ్‌కు వెళ్తున్నారు. లోకేష్… ఎవరిని అంటున్నారో తెలియకుండా… కుక్క అని తిట్టినందుకే ఆవేశపడి…ఇలా తిడుతున్నారు. అంటే.. లోకేష్ వారిని రెచ్చగొట్టారన్నమాట. నిజానికి ఇలా బుతులు తిట్టుకుంటే ఎవరికీ నష్టం లేదు. గతంలో మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడతారని అనుకునేవారేమో కానీ.. ఇప్పుడు అలవాటు పడిపోయారు.కానీ మాట్లాడే వారికే ప్రజల్లో ఓ రకమైన ఇమేజ్ వస్తోంది. ఆ విషయం గుర్తించలేకపోతున్నారు.