తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ టీడీపీని తెరాసలో విలీనం చేస్తే బెటర్ అంటూ మోత్కుపల్లి అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మీడియా మిత్రులతో చిట్ చాట్ లో మాట్లాడుతూ… ఇదంతా పార్టీ చూసుకునే వ్యవహారం అన్నారు. మోత్కుపల్లి మాటల్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలన్నారు. రాజకీయాల్లో అధికారం ఒక్కటే పరమావధి కాదనీ, అధికారం లేకపోయినా కూడా రాజకీయాలు చెయ్యొచ్చనీ, కమ్యూనిస్టు పార్టీలు అధికారం లేకపోయినా ఎన్నోయేళ్లుగా పోరాటం చేస్తున్నాయని లోకేష్ అన్నారని సమాచారం. అధికారం ఒక్కటే పరమావధి కాదనీ, అధికారం లేదని చెప్పి ఇంకో పార్టీలో విలీనం చేయాలని వ్యాఖ్యానించడం సరైంది కాదంటూ ఆఫ్ ద రికార్డ్ నారా లోకేష్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రజాసేవలో పార్టీలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అన్నారట.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండటం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కి వెళ్లి, ఎన్టీఆర్ కు నివాళులు అర్పించలేకపోయారని వివరణ ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్న చోటే ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని చెప్పారు. ఇక, ఇతర నేతల స్పందన విషయానికొస్తే… ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ అభిమానుల్లో నిరాశ పెరుగుతుందని పెద్దిరెడ్డి అన్నారు. తెరాసలో పార్టీని విలీనం చేసి, ఆంధ్రాలో అధికారం కూడా ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా చేశారు. ఇతర టీడీపీ నేతలు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందిస్తున్నారు. మోత్కుపల్లి వ్యాఖ్యలపై పాలిట్ బ్యూరో చర్చిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.
పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని లోకేష్ చెప్పడం కొంతవరకూ బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే, ఆ కోణంలో విశ్లేషిస్తే… మోత్కుపల్లి టీ టీడీపీకి చేసిందేముంది..? గవర్నర్ పదవి ఇస్తారన్న ఆశతో మౌనంగా కూర్చున్నారు. క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. సరే, ఆ పదవి రాదని తేలిపోయేసరికి… తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు మాటిచ్చారంటూ మరికొన్నాళ్లు ఎదురుచూశారు. అదీ సాధ్యం కాదనేది దాదాపు స్పష్టమైపోయింది. కాబట్టి, ఇప్పుడు మిగిలిదంతా ఆ అసంతృప్తిని ఏదో ఒక అంశాన్ని మాధ్యమంగా చేసుకుని వెళ్లగక్కడమే! ప్రస్తుతం ఆయన చేస్తున్నది అదే అనుకోవచ్చు.