కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మౌనం పాటిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇలా జరిగినప్పుడల్లా, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తాటికాయంత అక్షరాలతో రాసే సాక్షి సైతం, ఈ రోజు తన బ్యానర్ స్టొరీ లో బడ్జెట్ మీద పాజిటివ్ టోన్ లో హెడ్డింగ్ పెట్టింది. గతంలో కేంద్రం మెడలు వంచుతాం, ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ బీరాలు పలికిన జగన్, ఇప్పుడు ఎందుకు బిజెపికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి అన్యాయం చేసినా మిన్నకుండి పోయారు అంటూ లోకేష్ జగన్ మీద, సాక్షి మీద సెటైర్లు వేశారు.
లోకేష్ ట్వీట్ చేస్తూ, “మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్ళకు సాష్టాంగ పడటం, భజన చేయడమే పోరాటం అనుకుంటున్నారా? ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి. ఇది ప్రజల తరపున మా డిమాండ్.గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబుగారు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? కేసుల భయంతో మీరు కేంద్రానికి దాసోహం అనొచ్చు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది?. . జగన్ గారూ! ఇన్నాళ్ళూ విశ్వనీయత అని మీరు అంటుంటే ప్రజల గురించి అనుకున్నాం. కానీ ఈ రోజు మీ విశ్వసనీయత మోడీ గురించి అని తెలిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగితే, మీ అక్రమ పత్రిక సాక్షిలో కేంద్రానికి భజన చేస్తూ ఇలాంటి రాతలు రాసుకున్న మీ గులాంగిరికి సలాం” అని రాసుకొచ్చారు.
లోకేష్ విమర్శల సంగతి పక్కన పెడితే, జగన్ కూడా కేంద్ర బడ్జెట్ పై స్పందించాల్సి ఉంది. గతంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడల్లా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత వల్లే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ పలుమార్లు వ్యాఖ్యానించిన జగన్, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై ఎలా స్పందిస్తాడో చూడాలన్న కుతూహలం ప్రజలలో ఉంది.