ముందస్తు ఎన్నికలు సిద్ధమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలను హీటెక్కించారు. ఇంకోపక్క కేంద్రం కూడా ఇదే ప్రతిపాదనతో సిద్ధమౌతున్న సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశమై ఏపీలో కూడా కొంత చర్చ మొదలైంది. టీడీపీ కూడా ముందస్తుకు సిద్ధమౌతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్న వేళ… ఇదే అంశమై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనడానికి టీడీపీ సిద్ధంగా ఉంటుందనీ, కానీ ముందస్తు ఎన్నికలు రావాలని మాత్రం కోరుకోవడం లేదన్నారు. ఐదేళ్లు పాలించమంటూ ప్రజలు తమకు అధికారం ఇచ్చారని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆర్నెల్లు ముందు ఎన్నికలొస్తే, ఆ మేరకు అభివృద్ధిని కోల్పోయే పరిస్థితి మనకి ఉంటుందని చెప్పారు.
తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననీ, పార్టీ అధినాయకత్వం ఆదేశించిన నియోజక వర్గం నుంచీ పోటీ చేస్తానని కూడా లోకేష్ స్పష్టం చేశారు. తన మతం ఆంధ్రా, కులం ఆంధ్రా, ఊరు ఆంధ్రా అనీ… కాబట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తాను పోటీకి చేస్తానని చెప్పారు. తనపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణల అంశమై కూడా లోకేష్ మాట్లాడారు. కొంతమంది పనిగట్టుకుని తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారనీ, వాటికి సంబంధించిన ఆధారాలు ఏవైనా చూపించాలనీ, ఒకరితో మాట్లాడాననిగానీ, ఫలానా వ్యక్తులతో ఫొటోలు ఉన్నాయనిగానీ, ఫలానా ప్రదేశంలో ఏదో చేశానని చిన్న ఆధారంతో వచ్చినా… ప్రజలకు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి చెప్పారు.
ముందస్తు ఎన్నికల విషయమై ఏపీలో చర్చ లేనట్టే. గతంలో టీడీపీ ఓసారి ముందస్తుకు వెళ్లింది. 2004లో అలిపిరి ఘటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సిద్ధపడ్డారు. అయితే, ఆ తరువాత రకరకాల కారణాలతో నాటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను దాదాపు ఆర్నెల్లపాటు వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో ఆర్నెల్లపాటు ఏపీలో ప్రభుత్వం లేదన్న పరిస్థితి ఏర్పడింది. 2004లో టీడీపీ అధికారం కోల్పోవడానికి బలమైన కారణాల్లో ఇదీ ఒకటనే అభిప్రాయం ఉంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి టీడీపీ గతానుభవం ఇది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరో ఏడాదిపాటు టీడీపీ చెయ్యాల్సిన పనులు కూడా చాలానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించడం, రాజధానిలో కొన్ని అభివృద్ధి పనులతోపాటు, కేంద్రం ఇచ్చిన హామీలపై పోరాటం తీవ్రతరం చేసి ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికల గురించి టీడీపీ ఆలోచించే అవకాశం లేదు.