జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తమతోనే వస్తారన్న ఆశాభావం వుందని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేవ్ ప్రకటించారు.ఇటీవల లోకేశ్ తెలుగుమీడియా సంస్థలకు వరసగా ఇంటర్వ్యూలిచ్చారు. అనేక విషయాలపై ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రతిపక్ష నేత ప్రధానిని కలిసినంత మాత్రాన టిడిపికి బిజెపి దూరమవుతుందనుకోనవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే కేంద్రం గనక సహకరించకపోతే ప్రశ్నించడానికి వెనకాడబోమని సాయం చేయనప్పుడు ఎవరైతే ఏమిటని లోకేశ్ అన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ విషయంలోనైతే ఆయన అభివృద్ధిని చూస్తున్నారు గనక తమతో కలసి వస్తారన్న నమ్మకం వుందని మంత్రి స్పస్టం చేశారు.ఇటీవల ఉద్ధానం పర్యటన తర్వాత పవన్ అమరావతిలో హంగామాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన తీరు, అనంతరం ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో లోకేశ్ మాటలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఏదో విధంగా బిజెపి,జనసేనల చెలిమిని నిలబెట్టుకోవడానికే టిడిపి శాయశక్తులా ఆఖరి వరకూ ప్రయత్నిస్తుందని అర్థమై పోతుంది.