సామాజిక మాధ్యమాల ప్రాధాన్యత ఏంటనేది ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకాస్త ముందు ఉంటుంది. గడచిన ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని సీఎం తనయుడు నారా లోకేష్ హోరెత్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చేసిన తరువాత.. సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల కిందట ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో కనిపించిన కథనాలపై ప్రభుత్వం ఘాటుగా స్పందించిన తీరు చూశాం. అయితే, ఈ మధ్య కాలంలో ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించారు! ఎలాగూ ఎన్నికలకు మరో ఏడాదిన్నరే సమయం కనిపిస్తోంది. కాబట్టి, ఇప్పట్నుంచీ వీలైనన్ని మాధ్యమాల ద్వారా ప్రజలకు టచ్ లో ఉండేందుకు చినబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు.
పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి అయిన దగ్గర నుంచీ సచివాలయానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆయా శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, తమ దృష్టికి వస్తున్న సమస్యలకు సమాధానాలు వెంటనే ఇవ్వాలనే కసరత్తును ఈ మధ్య చినబాబు కాస్త ఎక్కువగానే చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు. లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలు చెప్పుకునే కంటే.. సోషల్ మీడియాలో ద్వారా తెలియజేస్తేనే వెంటనే పరిష్కారం లభిస్తుందని కొంతమంది అంటున్నారు! అంటే, ఏ రేంజిలో ఆయన అధికారులను పరుగులు తీయిస్తున్నారో అర్థమౌతోంది కదా. ఇప్పటివరకూ సోషల్ మీడియా ద్వారా దాదాపుగా 8,500 ఫిర్యాదులు అందితే, వాటిలో ఓ 1500 మినహా మిగతా అన్నింటికీ పరిష్కార మార్గాలు లోకేష్ చూపించారని చెబుతున్నారు. తన దృష్టికి ఏదైనా ఫిర్యాదు రావడమే ఆలస్యం.. వెంటనే సంబంధిత అధికారులతో లోకేష్ భేటీ అవుతున్నారు.
ఓరకంగా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. అలాగని దీని వెనక రాజకీయ లబ్ధి లేదు అని మాత్రం చెప్పలేం. సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ మీద ఆ మధ్య ఎన్నిరకాలు వ్యంగ్యాస్త్రాలు ప్రత్యక్షమౌతూ ఉండేవో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నారు కాబట్టి, రకరకాల మార్గాల ద్వారా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తే… అదే మీడియాలో లోకేష్ కు సంబంధించి పాజిటివ్ ప్రచారం మొదలౌతుంది కదా! ఇతర మాధ్యమాలతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చే మైలేజ్ కూడా ఎక్కువే. దీంతోపాటు అధికార పార్టీకి కావాల్సిన ప్రచారమూ పనిలోపనిగా జరిగిపోతుంది. సో.. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన వెనక వ్యూహం ఇదీ అని అంటున్నారు!