యువగళం పాదయాత్రతో పార్టీకి ఊపు తెచ్చిన నారా లోకేష్.. ఎన్నికల ప్రచార భేరీని శంఖారావం పేరుతో నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం ఉంటుంది. నూట యాభై నియోజకవర్గాలను యాభై రోజుల్లో కవర్ చేస్తారు. పాదయాత్ర విశాఖ వరకే జరిగినందున శంఖారావం సభను శ్రీకాకుళం నుంచి ప్రారంభించనున్నారు. ‘ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే ‘శంఖారావం’ లక్ష్యం. ప్రతి రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది. ఈ నెల 11న ఇచ్ఛాపురంలో తొలిసభ నిర్వహిస్తాం. సీఎం జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం.’ అని అచ్చెన్నాయుడు వివరించారు.
‘రా.. కదలిరా’ సభలు ముగిశాయని.. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అరాచక.. విధ్వంస పాలనపై గళమెత్తుతూ గతంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో కొత్త చైతన్యం రేకెత్తించింది. 222 రోజుల పాటు, 3,132 కిలోమీటర్లు సాగిన యువగళం జైత్రయాత్రలా సాగిందని టీడీపీ నమ్మకంగా ఉంది.
బాబు ష్యూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ పేరిట టీడీపీ ప్రకటించిన పథకాలను శంఖారవం ద్వారా లోకేశ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. నేతలు, కార్యకర్తలతో ఆయన స్వయంగా సమావేశమై వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటారు. ప్రజలతో సైతం విస్తతంగా మమేకమవుతారు.