వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేయడాన్ని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అమరావతిలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ కి రైతులే స్వచ్చందంగా ముందుకు వచ్చి 33000 ఎకరాలను ఇవ్వడం తెలియదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిల్లీలో పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం వలన రాష్ట్రానికి తీరని నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. గత ఎన్నికలలో తమ పార్టీ చేతిలో వైకాపా ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని, ఆయన తీరు ఇలాగే కొనసాగినట్లయితే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైకాపా కనబడకుండా మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో పుట్టి పెరిగారు కనుకనే పదేపదే అవినీతి మంత్రం వల్లెవేస్తున్నట్లున్నారని లోకేష్ ఎద్దేవా చేసారు.
వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ఎత్తుకుపోవడం మొదలుపెట్టిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి, రాజధాని ప్రాంతంలో తెదేపా మంత్రులు, నేతల బినామీ భూముల కొనుగోళ్ళ వ్యవహారాన్ని బయటపెట్టి, ఫిరాయింపులను తాత్కాలికంగా నెమ్మదింపజేయగలిగారు. ఆ వ్యవహారం బయటపెట్టినప్పుడు తెదేపా జవాబు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడింది. తనపై జగన్ నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నందుకు ఆయనని కోర్టుకి ఈడ్చుతానని మంత్రి పి.నారాయణ హెచ్చరించారు కానీ అటువంటి ప్రయత్నమేదీ చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో జగన్ కూడా ఎందుకో కొంచెం వెనకడుగువేసినట్లు కనబడుతోంది. అందుకే వైకాపా ఎమ్మెల్యేల వలసలు మళ్ళీ మొదలయ్యాయి. వాటి జోరు పెరగడంతో, జగన్ మళ్ళీ దానికి అడ్డుకట్ట వేయడానికి “ఎంపరర్ ఆఫ్ కరప్షన్” అనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసి ఈసారి డిల్లీ నుంచి ప్రయోగిస్తున్నారు. లోకేష్ తో సహా తెదేపా నేతలు అందరూ దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారయినా ఆ బ్రహ్మాస్త్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడాలి. పనిచేస్తే తెదేపాకి పనిచేయకపోతే వైకాపా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి.