లోకేష్‌ను అరెస్ట్ చేస్తామంటూ హడావుడి చేసి.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా నమోదు చేసి.. ఏం నేరం చేశాడో.. ఏ అవినీతి చేశాడో చెప్పకుండా పదేళ్లకుపైబడే సెక్షన్లను చేర్చిన సీఐడీ అధికారులు హైకోర్టు ముందు మాట మార్చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో.. హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారని… లోకేష్‌ను అరెస్ట్ చేయబోమని తెలిపారు. 41ఏ నిబంధనలు పాటిస్తామని.. ఆ మేరకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇస్తామని చెప్పుకొచ్చారు.
అయితే అసలు కేసులో ఏ సెక్షన్లు పెట్టారో చెప్పకుండా ఇలా చేయడం సీఐడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. లోకేష్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఐఆర్ఆర్ కేసులో సెక్షన్లు మార్చామని కథలు చెప్పడంతో… ముందస్తు బెయిల్ పిటిషన్ ఆటోమేటిక్ గా డిస్పోజ్ అవుతుంది. కానీ నారా లోకేష్‌పై ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెలవప్మెంట్ కేసుల్లోనూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రహస్యంగా ఉంచారన్న అనుమానాలు వస్తున్నాయి. దీంతో లోకేష్ తరపు న్యాయవాదులు వాటిలోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.
సీఐడీ అధికారులు రాజకీయ కుట్రల్లో రాటుదేలిపోతున్నారన్న అనుమానాలు ఈ కోణంలోనే వస్తున్నాయి. చంద్రబాబు విషయంలో న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్న లోకేష్‌ను ఆ పని కూడా చేయకుండా విచారణకు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని.. తర్వాత ఇతర కేసుల్లో అరెస్టులు చూపించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి ఇలాంటి ఘోరమైన పనులు సీఐడీ చేస్తూండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.