ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ టీడీపీ నేతలకు పదవులు ఇస్తే సరిపోదు… కూటమి పార్టీల గురించి కూడా ఆలోచించాలి. వారిలోనూ పదవుల ఆశావాహులు ఉన్నారు. వారికీ ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.
కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై లోకేష్ నేతృత్వంలో కసరత్తు ప్రారంభమయింది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో జనసేనకు, బిజెపికి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. 2014 లో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేనకు పెద్దగా పదవులు ఇవ్వలేదు. సోము వీర్రాజుకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పట్లో జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే అన్నా .. పవన్ తీసుకోలేదు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా పదవులు ఇవ్వాలని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. ఇతర పార్టీల నేతల నుంచి లభించిన సహకారంపైనా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంలోనూ రచ్చ జరగకుండా… స్మూత్ గా కూటమి ముందుకు సాగాలని నేతలు కోరుకుంటున్నారు.