తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఇవాళ్టితో రాయలసీమలో ముగుస్తుంది. వైసీపీ కి బలమైన ప్రాంతంగా పేరుపడిన రాయలసీమలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది మూడు అంటే మూడు సీట్లు. అలాంటి చోట పాదయాత్ర అంటే ఎలా తట్టుకుంటారోనన్న సందేహం టీడీపీ శ్రేణుల్లో ఉండేది. కానీ కుప్పంలో ప్రారంభించి… బద్వేలు నుంచి కోస్తాలో అడుగుపెట్టేసరికి సీన్ మారిపోయింది. వారెవా లోకేష్ అని అనుకోని వారు లేరు. ఈ మధ్యలో జరిగినదంతా చరిత్ర.
44 నియోజకవర్గాల్లో జన ప్రభంజనం
కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర 124 రోజుల పాటు 44 నియోజవకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర సాగింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆయన చుట్టూ ఉండే జనాన్ని తక్కువ చేయడానికి ఆయన మాటల్ని ఎగతాళి చేయడానికి పెద్ద ఎత్తున బలగాలను ఇతర పార్టీలు మోహరించాయి. చివరికి జనసేన క్యాడర్ కూడా ఎగతాళి చేసేందుకు ప్రయత్నించారు. అయితే రాను రాను పెరుగుతున్న జన సందోహం.. లోకేష్ నిక్కచ్చి మాటలు… రాజకీయాలపై ఆయన అవగాహన అన్నీ స్పష్టమయ్యే సరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రతి చోటా.. పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనసందోహం.. టీడీపీ కూడా ఊహించలేదు..
సీమకు స్పష్టమైన భరోసా !
తాను సీమ బిడ్డనేనని చెప్పుకునేందుకు ఏ మాత్రం సంకోచించని లోకేష్.. రాయలసీమ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని ప్రజల ముందు ఉంచారు. గతంలో వైసీపీని ఆదరిస్తే. చేసిందేమీ లేదని.. ఆదరించిన వాళ్లను భక్షించారని.. కానీ అదే స్థాయి మద్దతు టీడీపీకి ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు. ఇందుకు సాక్ష్యంగా తమ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధినే ప్రజల ముందుంచారు. లోకేష్ స్పష్టమైన ఆలోచనలు… డొంకతిరుగుడులేకుండా సమాధానాలు చెప్పడం.. అందర్నీ ఆకట్టుకుంది. రాయలసీమ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రణాళిక లోకేష్ నుండి వచ్చిందన్న సంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది.
అపరిమిత శారీరక శ్రమ – అయినా అలుపులేని అడుగులు
గతంలో సీఎం జగన్ పాదయాత్ర చేసిన్పుడు వారానికి ఐదు రోజులు నడిచేవారు. పెద్దగా ఇంటరియాక్షన్స్ ఉండేవి కావు. మొత్తం ఆర్గనైజ్డ్ గా జరిగేవి. కానీ లోకేష్ పాదయాత్ర నిరంతరాయంగా జరుగుతోంది. తెల్లవారు జామునే ప్రారంభమయ్యే ఆయన దినచర్య.. అర్థరాత్రి వరకూ ఉంటోంది. అత్యధిక సమయం జనంలోనే ఉంటున్నారు. రోజుకు వేయి మందికిపైగా సెల్ఫీలు ఇస్తారు. కొన్ని వందల మందితో ఇంటరియాక్ట్ అవుతారు. పార్టీ పరిస్థితిని అధ్యయనం చేస్తారు. తీరిక లేకుండా పాదయాత్ర చేస్తున్న లోకేష్ .. పట్టుదలను ప్రత్యక్షంగా చూసిన ఎవరైనా … అనుకున్నది సాధిస్తారని అనుకోకుండా ఉండలేరు. ఇవాళ నుంచి నెల్లూరులోకి పాదయాత్ర ఎంటర్ అవుతుంది.