లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరి వారంలో రాబోతోందని.. తెలుగు మీడియాలోని ప్రధాన పత్రికలు కొద్ది రోజులుగా పదే పదే చెబుతున్నాయి. ఇలా స్పెసిఫిక్గా ఎందుకు చెబుతున్నారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికలకు ప్రతీ సారి.. అదే ఫిబ్రవరి చివరి వారం లేదా.. మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది. అదేదో హఠాత్ఫరిణామం అయినట్లు ఎందుకు చెబుతున్నారంటే.. దాని వెనుక.. తెలంగాణ పంచాయతీ ఎన్నికల స్ట్రాటజీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు కోర్టు చెప్పిన ప్రకారం.. జనవరి ఐదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ.. అది సాధ్యం అయ్యే సూచనలు కనిపించడం లేదు.
జనవరి పదిలోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు నిచ్చింది. అయితే ఆ లోగా ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ కోర్టు విధించిన గడువు లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవడం కష్టం. ఈ ఆలస్యానికి కారణం రిజర్వేషన్ల ప్రక్రియేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీల్లో రిజర్వేషన్ల ఖరారుకు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. బీసీల జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు. అవి అందిన తర్వాత వార్డు, సర్పంచ్ ల రిజర్వేషన్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ జనవరి ఐదు లోపు సాధ్యం కాదని.. ఎన్నో రకాల సమస్యలు వస్తాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. సుప్రీం ఆదేశాల మేరకు పంచాయతీల్లో రిజర్వేషన్లను 50 మించరాదని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా పంచాయతీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపైనా… బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మరో వైపు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెడితే… మరో వైపు పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయంగానూ.. ఇప్పుడు టీఆర్ఎస్ గెలుపు ఊపులో ఉంది. పార్టీలో ఉన్న గ్రూపులన్నీ.. కలసి టీఆర్ఎస్ విజయానికి పని చేశాయి. కానీ పంచాయతీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.. విడిపోతారు. గ్రామ రాజకీయాలతో.. టీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోతుంది. ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉండదు. అదే జరిగితే… మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికలపై ప్రభావం పడుతుంది. అందుకే… పార్లమెంట్ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేసి.. ఆ మేరకు కోర్టును ఆశ్రయిచినా… ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం… రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.