ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి హామీ ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలన్నీకేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన గల్లా జయదేవ్ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసారు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చురకలు వేశారు. ముఖ్యమంత్రి నోరు తెరిచి ఏమీ అడగలేదు. అందుకే ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమం అంతా ఒక సహృద్భావా వాతావరణంలో జరగడం, దానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడం మాత్రమే పేర్కొనదగ్గవిగా కనిపిస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ఈ శుభసందర్భంగా ప్రధాని మోడీ నిర్దిష్టమయిన ప్రకటన చేస్తారని ఆశించాము. ఆయన ఎటువంటి ప్రకటన చేయకుండా రాష్ట్ర ప్రజలందరినీ తీవ్ర నిరాశపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం ఉంది. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని జయప్రకాశ్ అన్నారు.