‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ డైలాగ్ ఉంది.
‘గ్యాప్ తీసుకోవాల్సివచ్చింది’ అని. ఈ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్. అల్లు అర్జున్ సినిమాలు లేట్ అవ్వడంతో ఆ డైలాగ్ యాప్ట్ అయ్యింది. ‘పుష్ప 2’ తరవాత కూడా బన్నీకి కాస్త గ్యాప్ వచ్చేట్టే కనిపిస్తోంది.
‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలి. ‘గుంటూరుకారం’ తరవాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. బన్నీతో త్రివిక్రమ్ హిట్ కాంబినేషన్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాపై త్రివిక్రమ్ కూడా చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. తన కెరీర్లో అతి పెద్ద కాన్వాస్ ఉన్న కథ ఇది. అందుకోసం చాలా రోజుల నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా మొదలవుతుందనుకొన్నారంతా. ఆ తరవాత ఏప్రిల్, మే కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు జూన్ వరకూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే బన్నీ దాదాపు 7 నెలలు ఖాళీగా ఉండాల్సిందే.
బన్నీ కూడా ఏమాత్రం తొందరపడడం లేదు. ‘పుష్ప 2’ కోసం బాగా కష్టపడ్డాడు. ప్రమోషన్ల కోసం బాగా తిరిగాడు. తనకు కాస్త విరామం కావాలి. కాకపోతే.. మరీ 7 నెలల గ్యాప్ అంటే కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేలోగా మరో ప్రాజెక్ట్ పూర్తి చేసే టైమ్ కూడా బన్నీ చేతిలో లేదు. ఒకటి.. త్రివిక్రమ్ స్పీడు పెంచి, షూటింగ్ కి రెడీ అవ్వాలి, లేదంటే మొదలయ్యేంత వరకూ బన్నీ ఎదురు చూడాలి. ఇవే బన్నీ ముందున్న రెండు మార్గాలు.