ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీలతో మూడు ప్రాజెక్టులు వున్నాయంటూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు. అయితే వాస్తవం చూస్తుంటే ఈ ప్రాజెక్టులు ఏవీ సమీప భవిష్యత్ లో తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. మహేష్ బాబుతో ప్రాజెక్టు అన్నది ఊహాజనితం. ఎందుకంటే దీనికి దర్శకుడు లేడు.
మహేష్ బాబు చేతిలో రెండు సినిమాలు వున్నాయి. అవి పూర్తి కావాలి. అంటే 2020 సమ్మర్ తరువాత. పైగా సుకుమార్ పేరు చెప్పకుండా పరుశురామ్ కథ తయారుచేస్తున్నారు అని చెప్పారు మైత్రీ నిర్మాతలు. అంటే మహేష్-సుకుమార్ కాంబినేషన్ లేనట్లేనా?
ఇక ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమా. ఇది కూడా వచ్చే ఏడాది సమ్మర్ నాటి ముచ్చట. కానీ ఈలోగా ఎన్టీఆర్ కు రెండు కమిట్ మెంట్ లు వున్నాయి. త్రివిక్రమ్ తో ఒకటి, కొరటాల శివతో ఒకటి. అంటే ఇది కూడా 2020 చివరి సంగతే.
కాస్త ఆశాజనకంగా వున్నది బన్నీ-సుకుమార్ ప్రాజెక్టు మాత్రమే. అది కూడా బన్నీ-వేణు శ్రీరామ్ ప్రాజెక్టు పూర్తయిన తరువాతనే వుంటుంది. అందువల్ల 2020 సమ్మర్ తరువాతే మైత్రీ భారీ ప్రాజెక్టుల సంగతి కాస్త చురుగ్గా వార్తల్లోకి వస్తుంది.