సజ్జల రామకృష్ణారెడ్డి ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. చాలా సేపటి తర్వాత ఆయనను హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించారు. దాంతో ఆయన తిరిగి వచ్చేశారు. సజ్జలను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఏపీ డీజీపీ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నాయని .. ఓ కేసు విషయంలో కృష్ణా జిల్లా ఎస్పీ జారీ చేశారన్నారు. ఈ కేసులో ఆయనను డీటెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాలకు వెళ్లాలనుకుంటే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లొచ్చు..లేదా బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి వెళ్లొచ్చు. కానీ ఆయన ఢిల్లీని ఎంచుకోవడం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. లుకౌట్ నోటీసును కప్పి పుచ్చి వెళ్లిపోగలిగితే సమస్యే ఉండదు. కానీ అడ్డుకుంటే.. ఏపీ పోలీసులు వెంటనే వచ్చి అదుపులోకి తీసుకోవడానికి ఉండదు. హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతిస్తారు. అందుకే ఢిల్లీలో ఓ ట్రైల్ వేసేందుకు ప్రయత్నించారు. కానీ దొరికిపోయారు.
వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పుడు పనికి.. ప్రతి నేరానికి బాధ్యుడు సజ్జల రామకృృష్ణారెడ్డి. ఆయన కనుసన్నల్లోనే అంతా జరిగింది. చాలా మంది పోలీసులకు ఆయన నేరుగా ఆదేశాలు ఇచ్చారు. కాదంబరి జెత్వానీ కేసులో ఆయన పై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి ఆధారాలతో రిపోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులోనే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకునే ఆయన పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు.